అస్సాం స్క్రీనింగ్‌‌ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ

అస్సాం స్క్రీనింగ్‌‌ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీ
  • అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
  • అభ్యర్థుల ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు
  • ప్యానెల్​లో ముగ్గురు సభ్యులు

గువాహటి/న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే ‘స్క్రీనింగ్ కమిటీ’ చైర్‌‌పర్సన్‌‌గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని నియమించింది. ఈ ఏడాదే అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంలో ఈ స్క్రీనింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్​లో అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

వీటికి కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కాగా, ప్రియాంకా గాంధీ నేతృత్వంలోని ఈ కమిటీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి, గెలుపు గుర్రాలను ఎంపిక చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేస్తుంది. ప్యానెల్​లో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఎంపీలు సప్తగిరి శంకర్ ఉలక, ఇమ్రాన్ మసూద్​తో పాటు డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ కమిటీలో ఉంటారు. గాంధీ కుటుంబ సభ్యులు ఒక స్టేట్ స్క్రీనింగ్ కమిటీకి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి.

అస్సాంలో గత 10 ఏండ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా పవర్ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. గౌరవ్ గొగోయ్ లీడర్​షిప్​లో ఇప్పటికే ఇతర ప్రతిపక్ష పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నది.

కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరికీ.. 

కేరళ స్క్రీనింగ్ కమిటీ చైర్​పర్సన్​గా కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రి ఉంటారు. రాజ్యసభ ఎంపీలు సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ దంగితో పాటు అభిషేక్ దత్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా.. తమిళనాడు, పుదుచ్చేరి స్క్రీనింగ్ కమిటీ చైర్​పర్సన్​గా చత్తీస్​గఢ్ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ ఉంటారు. సభ్యులుగా యశోమతి ఠాకుర్, జీసీ చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తారు. వెస్ట్​బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ చైర్​పర్సన్​గా పార్టీ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ చైర్​పర్సన్​గా వ్యవహరిస్తారు.

మహ్మద్ జావెద్, మమతా దేవి, బీపీ సింగ్ సభ్యులుగా ఉంటారు. కాగా, ఆయా రాష్ట్రాల జనరల్ సెక్రటరీలు/ఇన్​చార్జ్​లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు తమ తమ స్క్రీనింగ్ కమిటీల్లో ఎక్స్ ఆఫిసియో మెంబర్లుగా వ్యవహరిస్తారు.