బ్లూ జోన్​ డైట్ తో  ప్రోటీన్లు

బ్లూ జోన్​ డైట్ తో  ప్రోటీన్లు

ఇమ్యూనిటీ పెరగాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా తిండి బలంగా ఉండాలి. కరోనా ముప్పు పుర్తిగా తొలగిపోని ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ‘బ్లూ జోన్​ డైట్’కి ఓకే చెబుతున్నారు. ఇంతకీ ఈ డైట్​ స్పెషాలిటీ ఏమిటి? ఈ డైట్​ భారతీయులకి సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలకి న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్​ ఇలా చెబుతున్నారు. 

కొవిడ్​ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు బ్లూ జోన్​ డైట్​ వైపు మళ్లుతున్నారు. ఇది పూర్తిగా ప్లాంట్​ బేస్డ్ డైట్. ఇందులో చెప్పిన చాలావాటిని మనం ఆల్రెడీ తింటాం. ఈ డైట్​లో జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, చిక్కుడు జాతి గింజలు, బీన్స్, రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి ఉంటాయి.  విదేశాల్లో ఛీజ్​ వంటి  పాల ఉత్పత్తులు ఎక్కువ తింటారు. అందుకే వాళ్లలో ప్రొటీన్​ లోపం కనిపించదు. కానీ,  మన దగ్గర నాన్​–వెజ్‌‌‌‌, పప్పుల ద్వారా తప్ప ప్రొటీన్​ లభించే అవకాశం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవాళ్లలో పాలు తాగేవాళ్లు చాలా తక్కువ. అందుకే, ఇండియన్స్​ డైట్​లో ప్రొటీన్​ లోపం ఎక్కువ. గర్భిణులు, చిన్నపిల్లలకి కూడా చాలినంత ప్రొటీన్​ అందడం లేదని హెల్త్​ సర్వేలు చెబుతున్నాయి. 
పక్కాగా సరిపోతుంది 
ప్రొటీన్​ సరిపడినంత అందాలంటే గుడ్డు, పాలు, పాల పదార్థాలు, చేపలు, మొలకెత్తిన గింజలు ఎక్కువ తినాలి. కావాలంటే ప్రాసెస్డ్ ఫుడ్, మటన్​ మానేసినా పర్లేదు. ఇలాచేస్తే ఒబెసిటీ, డయాబెటిస్​, కొలెస్ట్రాల్​, గుండెజబ్బుల వంటివి చాలావరకు తగ్గుతాయి. డైట్​లో ఈ మార్పులు చేసుకుంటే దీర్ఘకాల వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. ఎందుకంటే... మన దగ్గర ఇరవై య్యేళ్లలోపు వాళ్లు కూడా కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, లావు సమస్యలతో బాధపడుతున్నారు. చాలామందికి ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కొవిడ్ రికవరీ రేటు తక్కువ ఉంటోంది. కాబట్టి ప్రొటీన్​ దొరికే పదార్థాల్ని చేర్చుకుంటే మన వాతావరణానికి కూడా బ్లూ జోన్​ డైట్​ పక్కాగా సరిపోతుంది.

 బ్లూ జోన్​ డైట్​ స్పెషల్ ఏమిటంటే.. దీనిలో ఎక్కువగా శాకాహారమే ఉంటుంది. ఈ డైట్​ ఫాలో అయ్యేవాళ్లు కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, బీన్స్​, చిక్కుడు జాతి గింజలు, నట్స్​, ఆలివ్​ ఆయిల్​, బెర్రీలు, ఓట్స్​, బార్లీ వంటివి మాత్రమే తింటారు. మాంసం, షుగర్ ఉన్న​ డ్రింక్స్​, ప్రాసెస్డ్ ఫుడ్​ అస్సలు ముట్టరు. అయితే, బ్లూ జోన్​ కిందకి వచ్చే సార్డినియాలో మాత్రం మెడిటేరియన్​​ డైట్​ కూడా ఫాలో అవుతారు. వీళ్లు కొంత మోతాదులో చేపలు, పాలపదార్థాలు, ఆల్కహాల్, రెడ్​మీట్​ తీసుకుంటారు. గ్రీక్​ దేశంలోని ఇకారియా ద్వీపం, జపాన్లోని ఒకినవా ద్వీపం, ఇటలీలోని సార్డీనియా, క్యాలీఫోర్నియా, కోస్టారికాలోని నికోయా ద్వీపకల్పం వంటి ప్రాంతాల్లో బ్లూ జోన్​ డైట్​ ఫాలో అవుతున్నారు.