
తల్లాడ, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసహంరించుకోవాలని ఆదివారం తల్లాడలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు, ముస్లిం, క్రైస్తవులు, వ్యవసాయ కూలీలను చీల్చి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
దీనిని యావత్ జాతిపై దాడిగా గుర్తించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులను దోచుకునేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీర మోహన్ రెడ్డి, వెంకటలాల్, కాంగ్రెస్ నాయకులు రాయల రాము, తుమ్మలపల్లి రమేశ్, సీపీఎం నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, అయినాల రామలింగేశ్వరరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు షేక్ యూసుఫ్, మాజీ జడ్పీటీసీ మూకర ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.