Public Opinion: కర్నాటకలో ఓటర్ల ప్రధాన సమస్యలివే.. సర్వేలో తేలిన నిజాలు

 Public Opinion: కర్నాటకలో ఓటర్ల ప్రధాన సమస్యలివే.. సర్వేలో తేలిన నిజాలు

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున లోక్‌నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) సహకారంతో  నిర్వహించిన ఓ సర్వేల్ పబ్లిక్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్య సమస్యల్లో నిరుద్యోగం, ఆ తర్వాతి స్థానంలో పేదరికం ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఏప్రిల్ 20 నుంచి 28 మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల అధ్యయనంలో పాల్గొన్న 28శాతం మంది నిరుద్యోగమే అతిపెద్ద సమస్యగా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత 25శాతం మంది పేదరికానికి ఓటేశారు. యువ ఓటర్లకు నిరుద్యోగం పెద్ద సమస్య అయితే, గ్రామీణ కర్ణాటక ఓటర్లకు పేదరికం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.

గత ఐదేళ్లలో తమ ప్రాంతాల్లో ధరలు పెరిగాయని ఈ సర్వేలో 67 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా (51%) అవినీతి పెరిగిందని నమ్ముతుండగా, 35% మంది మాత్రం మునుపటి లాగే ఉందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అవినీతి పెరిగిపోయిందని చాలా మంది సాంప్రదాయ బీజేపీ మద్దతుదారులు (41%) చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే కొత్త రిజర్వేషన్ నిర్ణయాల గురించి తెలిసినట్టుగా తెలుస్తోంది. కొత్త కోటా విధానానికి మద్దతుదారులు ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, వ్యతిరేకించే వారు కాంగ్రెస్ మద్దతుదారులని సర్వేలో తేలింది.

టిప్పు సుల్తాన్ మరణానికి సంబంధించిన వివాదంపై, ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ విషయం గురించి తెలుసునని సర్వే కనుగొంది. 74% మంది ఈ వివాదాన్ని మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నట్లు భావించారు. ఈ వరుసలో టిప్పు సుల్తాన్‌ను ఇద్దరు వొక్కలిగ ముఖ్యనాయకులు చంపారని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. దీనికి కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు ఇచ్చారు.

వివాదం గురించి తెలిసిన వారిలో 29% మంది సమస్యను లేవనెత్తడం సమర్థనీయమని భావిస్తున్నారు. టిప్పు వివాదాన్ని లేవనెత్తడాన్ని సమర్థించేది ప్రధానంగా బీజేపీ మద్దతుదారులేనని, వ్యతిరేకించే వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే వెల్లడించింది.

CSDS అభిప్రాయ సేకరణలో అంచనా వేయబడిన మరో కీలక అంశం "ప్రాంతీయ వివక్ష". చాలా మంది (41%) ఉత్తర కర్ణాటక ప్రజలు వివక్షకు గురవుతున్నారని నమ్ముతున్నారు. అలాగే, 66% మంది ప్రతివాదులు ఇతర ప్రాంతాల కంటే బెంగుళూరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని చాలా మంది ఓటర్లు చెబుతున్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మొత్తం పనితీరుపై, 27% మంది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పట్ల తాము "పూర్తిగా సంతృప్తితో ఉన్నాం" అని చెప్పారు 24% మంది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వానికి 36%, కేంద్రంలోని పార్టీ ప్రభుత్వంపై 42%మంది "కొంత సంతృప్తితో ఉన్న"ట్టుగా తెలిపారు.

సంక్షేమ పథకాలు ఓటర్లపై పెను ప్రభావం చూపాయని, కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధిదారులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయ సేకరణ వెల్లడించింది. ఈ సర్వేను ఎంపిక చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 82 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 2,143 మంది ఓటర్లపై చేసినట్టు సమాచారం.