పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా

పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా

చండీఘడ్: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. కొద్దిసేపట్లో సీఎల్పీ సమావేశం అవుతున్న నేపధ్యంలో ఆయన రాజీనామా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే రాజ్ భవన్ కు చేరుకున్నఅమరీందర్ సింగ్ తన రాజీనామా లేఖను గవర్నర్‌ను కలిసి సమర్పించారు. యూపీఏ అధినేత్రి సోనియా ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన గవర్నర్ కు రాజీనామా సమర్పిస్తున్న ఫోటోను తనయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకున్నా.. నన్ను అవమానించారు
ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ రాజ్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లకుపైగా సీఎంగా పనిచేసిన 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న తనను తనను సొంత పార్టీ నేతలే అవమాన పరిచారని అమరీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా.. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని.. కనీసం మూడుసార్లు తనకు తెలియకుండా పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని ఆయన ఆరోపించారు. తనను ఏమాత్రం గౌరవించడం లేదనే భావన కలుగుతోందని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చానని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని..  సహచరులతో సంప్రదించిన తరవాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తానని చెప్పారు. తన స్థానంలో సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమని.. ఎవరిని ఎంపిక చేయనున్నారో తనకు తెలియదన్నారు. వారికి నమ్మకున్న వారికే సీఎం సీట్లో కూర్చెబెడతారని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తరచూ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న తీరుపై సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నేరుగా సోనియా, రాహుల్ గాంధీలను కలసి ఆయన సిద్దూపై ఫిర్యాదు చేయగా.. పార్టీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది.