కుక్కలతో మీకేం ఇబ్బంది?

కుక్కలతో మీకేం ఇబ్బంది?
  •     అవి మీకేమైనా హాని చేసినయా?
  •     బీజేపీ విమర్శలకు రాహుల్ కౌంటర్

 గుమ్లా(జార్ఖండ్): కాంగ్రెస్ కార్యకర్తలను కుక్కల్లాగ చూస్తున్నారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఓ పెట్ ఓనర్​తో ఆయన ఇంటరాక్ట్ అయిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బీజేపీ చేస్తున్న కామెంట్లపై స్పందించారు. మంగళవారం జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో జరిగిన రోడ్ షోలో,  మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వీడియోలోని పెట్ ఓనర్ అసలు కాంగ్రెస్ కార్యకర్త కాదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను ఆ కుక్కకు బిస్కెట్ ఇచ్చినప్పుడు అది తినలే. భయపడింది. అందుకే బిస్కెట్​ను కుక్క ఓనర్ కు ఇచ్చి తినిపించమని చెప్పాను. అప్పుడు ఆ బిస్కెట్ ను కుక్క తిన్నది. ఇందులో సమస్య ఏముంది” అని ప్రశ్నించారు. ‘‘అసలు కుక్కలతో బీజేపీకి ఉన్న ఇబ్బందేమిటి? అవి వాళ్లకేం హాని చేశాయి?” అని అడిగారు. జార్ఖండ్​లో బీజేపీ హయాంలో అభివృద్ధి పేరుతో ఆదివాసీల భూములను లాక్కున్నారని మండిపడ్డారు. లక్షలాది ఎకరాలను పేదల నుంచి గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారని.. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

నేనా బిస్కెట్ తిన్లే: హిమంత 

రాహుల్ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్​ లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు ట్యాగ్ చేయగా.. ఆయన కూడా రాహుల్​పై విమర్శలు గుప్పించారు. ‘‘నేను పార్టీ మీటింగులకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేవాడిని. ఆయన తన పెట్ డాగ్ ‘పిడి’ తినే ప్లేటులోని బిస్కెట్లనే పార్టీ నాయకులకు ఆఫర్ చేసేవారు” అని విమర్శలు గుప్పించారు. రాహుల్​తో పాటు ఆయన కుటుంబం మొత్తం కలిసినా నన్ను ఆ బిస్కెట్ తినేలా చేయలేకపోయారు. నేను ఆత్మాభిమానం ఉన్న అస్సామీని, భారతీయుడిని. అందుకే ఆ కుక్క బిస్కెట్లను తినలేక  కాంగ్రెస్​కు రాజీనామా చేశాను” అని హిమంత బిశ్వశర్మ కామెంట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. 

న్యాయ్​ యాత్రలో భాగంగా ఈ నెల 4న జార్ఖండ్ లోని ధన్ బాద్​లో ఓ పెట్ ఓనర్ తో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ కుక్కకు బిస్కెట్లు ఇవ్వగా, అది తినకపోవడంతో.. ఓనర్​కు బిస్కెట్లు ఇచ్చి తినిపించమని చెప్పారు. ఈ వీడియోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. దానికి ‘‘కొన్ని రోజుల కింద కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ కుక్కలు తినే బిస్కెట్లను కార్యకర్తకు ఇచ్చారు. కార్యకర్తలను పార్టీ యువరాజు ఇలా కుక్కల్లాగా చూస్తే, అలాంటి పార్టీ కనుమరుగైపోవడం సహజం” అని కామెంట్ పెట్టారు.