
- ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్
- ఇప్పటికే 33 శాతం అధిక వర్షపాతం
- అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు
- 112% అధికంగా వర్షాలు కురిసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది గురువారం నాటికి వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాల కాలం మంగళవారంతో పూర్తయింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సగటు వర్షపాతం 74.07 సెంటీమీటర్లు కాగా.. 98.83 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇది సాధారణం కన్నా 33 శాతం ఎక్కువ. 12 జిల్లాల్లో వంద సెంటీమీటర్లకుపైగా సగటు వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా ములుగు జిల్లాలో 1,45.74 సెంటీమీటర్లు, ఆదిలాబాద్‌లో 136.34, కామారెడ్డిలో 132.87, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 131.25, మెదక్‌లో 130.15, భద్రాద్రి కొత్తగూడెంలో 115.84, నిర్మల్‌లో 115.7, వరంగల్‌లో 110.24, సిద్దిపేటలో 106.36, జయశంకర్భూపాలపల్లిలో 105.81, మంచిర్యాలలో 104.33, నిజామాబాద్‌లో 103.03 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. మొత్తంగా 7 జిల్లాల్లో లార్జ్ ఎక్సెస్(సాధారణం కన్నా 60 శాతం ఎక్కువ), 16 జిల్లాల్లో ఎక్సెస్(సాధారణం కన్నా 20 నుంచి 59 శాతం అధికం), పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. మరోవైపు అన్ని మండలాల్లోనూ ఈసారి మంచి వర్షాలే పడ్డాయి. కేవలం మూడు మండలాల్లోనే లోటు వర్షపాతం నమోదైంది. 621 మండలాల్లోని 137 మండలాల్లో లార్జ్ ఎక్సెస్, 294 మండలాల్లో ఎక్సెస్, 187 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
ఒక్క జూన్‌లోనే లోటు..
నైరుతి రుతుపవనాల కాలంలో కేవలం ఒక్క జూన్‌లోనే లోటు వర్షపాతం నమోదైంది. వాస్తవానికి ఈ ఏడాది మే 26నే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటరైనా.. అల్పపీడనాలు ఏర్పడకపోవడం, గాలుల ప్రభావంతో జూన్‌లో సరైన వర్షాలు పడలేదు. 13.03 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్నా.. 20 శాతం లోటు ఏర్పడింది. జులై మూడో వారం వరకు ఇవే పరిస్థితులు కొనసాగినా.. అడపాదడపా కురిసిన భారీ వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో మాత్రం నెల ప్రారంభం నుంచే మెరుగైన వర్షాలు కురిశాయి. 21.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను.. 37.85 సెంటీమీటర్లు రికార్డయింది. ఇది సాధారణం కన్నా 75 శాతం అధికం. ఇక సెప్టెంబర్‌లోనూ 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో 16.72 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 26.77 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
ఇక ఈశాన్యం వంతు..
అక్టోబర్ నుంచి డిసెంబర్వరకు ఈశాన్య రుతు పవనాలతో వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి లాంగ్ రేంజ్ ఫోర్ కాస్ట్‌ను విడుదల చేసింది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 4 నెలల పాటు 112 శాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 1971 నుంచి 2020 వరకు డేటా ఆధారంగా పోస్ట్ మాన్సూన్సీజన్లో సగటు వర్షపాతం 33.41 సెంటీమీటర్లుగా ఉందని తెలిపింది. అక్టోబర్‌లో 115 శాతం కన్నా ఎక్కువ వర్షాలు పడుతాయని చెప్పింది.