COOLIE Review: ‘కూలీ’ ఫుల్ రివ్యూ.. రజినీకాంత్-లోకేష్ సినిమా ఎలా ఉందంటే?

COOLIE Review: ‘కూలీ’ ఫుల్ రివ్యూ.. రజినీకాంత్-లోకేష్ సినిమా ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్గా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (COOLIE). ఈ మూవీ ఇవాళ (ఆగస్టు 14న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణంతో మూవీ విడుదలైంది. సన్ పిక్చర్స్ పతాకంపై 'కూలీ' చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్గా పనిచేశారు.

కథేంటంటే:

దేవరాజ్ అలియాస్ దేవా (రజనీకాంత్) తన గతాన్ని పక్కనే పెట్టేసి అజ్ఞాతంలో బ్రతుకుతుంటాడు. ధూమపానం మరియు మద్యపానాన్ని నిషేధించే, కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్‌ రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు (రాజశేఖర్) చనిపోయాడని తెలుస్తోంది. రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఆ ఇంటికి వెళతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతీ (శృతిహాసన్) దేవాను అడ్డుకొంటుంది. బాధతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది.

అయితే, రాజశేఖర్ చనిపోవడానికి కారణం హర్ట్ ఎటాక్ కాదని.. మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా. అంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతీతో పాటు తన ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు. వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో.. హంతకుడిని వెలికి తీయాలని నిశ్చయించుకున్న దేవా.. విశాఖపట్నంలో ఒక స్మగ్లింగ్ ముఠాలోకి చొరబడతాడు. అక్కడ సైమన్ (నాగార్జున) చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు.

అసలు సైమన్ చేసే ఆ అక్రమ వ్యాపారం ఏమిటీ? ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు? రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజమేంటీ? సైమన్ కుమారుడు అర్జున్ (కన్నా రవి), తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి, కస్టమ్స్ అధికారి ఎందుకు అవుతాడు? ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ పాత్రలేమిటి? అన్నది మిగతా కథ.

కథ విశ్లేషణ:

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)..ఆడియన్స్కు ఈ పేరు వింటే..ఏదో మ్యాజిక్.. అదేదో తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు.. లోకేష్ తెరకెక్కించిన నగరం మూవీ నుంచి రీసెంట్ లియో వరకు ఆడియన్స్లో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు అయితే మరో ఎత్తు. ఈ సినిమాలతో లోకేష్ అంటే ఇది అనేలా ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసేశాడు.

అయితే, తన సినిమాల సక్సెస్కి ముఖ్య కారణం తాను ఎంచుకున్న అంశాలే అని బలంగా చెప్పుకోవొచ్చు. అవే మోస్ట్ డేంజరస్ "మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు". ఈ అంశాల చుట్టే కథ ఇంట్రెస్టింగ్గా అల్లుకుంటాడు. ఇక ఇవే అంశాలతో.. కూలీ కూడా వచ్చింది. అయితే, ఇందులో లోకేష్ ఎంచుకున్న స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ గత సినిమాలకు పూర్తి భిన్నం.

అలాగే, ఓ యూనియన్ నాయకుడు ఒక పోర్ట్ టౌన్లో, కూలీలను దోపిడీ చేసి, క్రూరంగా చంపేసి, వారి ఆనవాలు కూడా తెలియకుండా బ్రూటల్గా ప్రవర్తిస్తుంటారు. ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఓ సాధారణ కూలీ ఎలా ఎదిరించాడనేది ఇంట్రెస్టింగ్గా చూపించారు. అందుకు తోడు ఎమోషనల్ అంశాలని తీసుకొచ్చి లోకేష్ సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా లోకేష్ కనగరాజ్ జీనియస్ స్క్రీన్ ప్లే, నాగార్జున విలనిజం, రజినీకాంత్ పెర్ఫార్మన్స్, సౌబిన్ వర్సటైల్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలం. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు కలిసొచ్చాయి.

ఎవరెలా చేశారంటే:

ఇందులో రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, సైమన్గా నాగ్ విలనిజంతో అదిరగొట్టేశారు. దయాళ్గా సౌబిన్ షాహిర్ది చాలా పెద్ద రోల్. ఈ సినిమాకు సౌబిన్ మరో హీరో అని చెప్పుకోవొచ్చు. రాజశేఖర్గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దహా పాత్రలో అమీర్ ఖాన్.. ఇలా స్థార్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

టెక్నీకల్ అంశాలు:

లోకేష్ కనగరాజ్.. తాను రాసుకున్న కథతో ఇంపాక్ట్ చూపించకపోయిన.. స్క్రీన్ ప్లేతో మాత్రం మెంటల్ మాస్ ఎక్కించాడు. ఆసక్తికరమైన పాత్రలతో సినిమాని బలంగా తీర్చిదిద్దాడు. అనిరుధ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాకు వంద శాతం న్యాయం చేశాడు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.