రెండు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం.. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు

రెండు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం.. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు
  • రంగారెడ్డి జిల్లాలో బైక్​ను వెహికల్​ ఢీకొని ముగ్గురు..
  • ఆదిలాబాద్​ జిల్లాలో బైక్‌‌‌‌ను ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి, ఆదిలాబాద్​ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కడ్తాల్  మండలం ముచ్చర్ల గేట్ సమీపంలో శ్రీశైలం–హైదరాబాద్  హైవేపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన ఇరుకుల ప్రశాంత్(22) అక్కడికక్కడే చనిపోగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు కీర్తి, భానుతేజ్  చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రమాదంలో ఉదయశ్రీ తీవ్రంగా గాయపడింది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్  బైక్ పై అన్న, అక్క పిల్లలైన ఉదయశ్రీ (12), కీర్తి(8), భానుతేజ్(7)తో కలిసి కడ్తాల్  నుంచి కందుకూరు వైపు వెళ్తున్నాడు.

ముచ్చర్ల గేట్  సమీపంలో బైక్ ను కొల్లాపూర్  నుంచి హైదరాబాద్ కు మామిడికాయల లోడ్ తో వెళ్తున్న వెహికల్​ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్  అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కీర్తి, భానుతేజ్  చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఆదిలాబాద్  జిల్లాలో దంపతులు..

గుడిహత్నూర్: ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ఉట్నూర్‌‌‌‌ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు చనిపోయారు. బైక్‌‌‌‌పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌‌‌‌ మండలం తోయగూడ గ్రామానికి చెందిన పెందూర్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌(50), ఆయన భార్య శకుంతల బాయి(43) మంగళవారం మధ్యాహ్నం తోషం నుంచి నార్నూర్‌‌‌‌  మండలం పాట్నాపూర్‌‌‌‌కు బంధువుల వివాహ కార్యక్రమానికి బైక్‌‌‌‌పై బయలుదేరారు.

ఈక్రమంలో ఉట్నూర్‌‌‌‌ మండలం యేందా గ్రామం వద్ద వీరి బైక్‌‌‌‌ను కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఉట్నూర్‌‌‌‌ నుంచి ఆదిలాబాద్‌‌‌‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు  దంపతులపై నుంచి దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన పెందూర్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, శకుంతల బాయిని ఉట్నూర్‌‌‌‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.