
- ఉమ్మడి జిల్లాలో 12 లక్షలకు చేరిన కార్డులు
- 23,030 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు
- కొత్త లబ్ధిదారుల్లో ఆనందం
జనగామ, వెలుగు : మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ రేషన్ పంపిణీ షురూ కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి జూన్లో పంపిణీ చేశారు. ఏండ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డుల జారీని ప్రస్తుత సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్డుల సంఖ్య 12 లక్షలకు చేరింది. ఉమ్మడి జిల్లాలో 2,305 రేషన్ దుకాణాలుండగా అన్నింటి పరిధిలో కొత్తగా లక్షకు పైగా
కార్డులు వచ్చి చేరాయి.
23,030 టన్నుల బియ్యం కేటాయింపు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రేషన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈ జిల్లాల్లో గత మే నెల వరకు 11,12,620 రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 12,16,008కి చేరాయి. కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. లబ్ధిదారుల సంఖ్య 36,17,604కు పెరిగింది. వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు. ఇందుకోసం 23,030 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారు అలాట్ చేయగా రేషన్ దుకాణాలకు చేరింది.
జనగామ జిల్లాలో 335 రేషన్ షాపులుండగా 3,470 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ అయ్యాయి. హన్మకొండ జిల్లాలో 413 దుకాణాలుండగా 4676 టన్నులు, వరంగల్ జిల్లాలో 500 దుకాణాలుండగా 5382 టన్నులు, మహబూబాబాద్ జిల్లాలో 558 దుకాణాలుండగా 5127 టన్నులు, భూపాలపల్లిలో 277 దుకాణాలుండగా 2495 టన్నులు, ములుగు జిల్లాలోని 222 రేషన్ దుకాణాలుండగా 1880 టన్నుల బియ్యం అలాట్ కాగా పంపిణీ చేయనున్నారు. దీంతో కొత్తగా రేషన్ తీసుకోనున్న లబ్ధిదారులు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది : మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం బీక్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని దంతెలగడ్డ తండ. పెండ్లై నాలుగేండ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సర్కారు టైంలో కొత్త రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కారు రాగానే మళ్లీ దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు వచ్చింది. ఈ నెల నుంచి సన్నబియ్యం కూడా ఇస్తామంటున్నరు. చాలా ఆనందంగా ఉంది.- బానోత్ అనిత, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారురాలు
పదేండ్లు ఎదురు చూసిన :మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్. నాకు పెళ్లయి 16 సంవత్సరాలు అవుతోంది. 14, 7 యేండ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులున్నరు. పదేండ్ల నుంచి రేషన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న. అప్పటి సర్కారు పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులు నలుగురి పేరుతో రేషన్ కార్డు మంజూరైంది. - ఎలికట్టె సురేశ్ గౌడ్, లబ్ధిదారుడు