Jaya Krishna : ఘట్టమనేని వారసుడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ!

Jaya Krishna : ఘట్టమనేని వారసుడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ!

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం బాలీవుడ్ నుండి ఒక యువ హీరోయిన్‌ను ఎంపిక చేసిందని సమాచారం. ఆమె మరెవరో కాదు, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ.

రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె బాలకృష్ణ సరసన 'బంగారు బుల్లోడు'తో పాటు నాగార్జున 'ఆకాశ వీధిలో', మోహన్ బాబు 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఆమె వారసురాలు రషా తడానీ, తన మొదటి తెలుగు సినిమాతో ఘట్టమనేని వారసుడికి జోడీగా రావడం ఆసక్తికరంగా మారింది. రషా ఇప్పటికే బాలీవుడ్‌లో 'ఆజాద్' చిత్రంతో అమన్ దేవగణ్ సరసన హీరోయిన్‌గా పరిచయం అయ్యారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి సంచలనాత్మక చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు సినీ వారసులను పరిచయం చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారని సమాచారం. అజయ్ భూపతి ఎంచుకునే కథలు, పాత్రలు ఎంత వినూత్నంగా ఉంటాయో 'ఆర్ఎక్స్ 100'లో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లను పరిచయం చేసిన తీరుతో మనకు తెలుసు. ఈసారి కూడా జయకృష్ణ, రషాలను ఒక ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ బాధ్యతలు చేపడతారని కూడా వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమాతో లాంచ్ చేసింది ఆయనే. ఇప్పుడు జయకృష్ణను కూడా ఆయనే లాంచ్ చేయబోతున్నారని వార్తలు రావడంతో ఘట్టమనేని అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, జయకృష్ణ లాంచింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారని సినీ వర్గాల టాక్. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ యువతరం కలయిక తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.