
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లో 4,400 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 96/2, 96/3 సర్వే నంబర్లలో 125 ఎకరాల్లో 582 ప్లాట్లతో పీ అండ్ టీ కాలనీ పేరుతో 1989లో లేఔట్ వేశారు. ఇందులో రెండు పార్కులకు సంబంధించి 4,400 గజాల స్థలం ఉంది. పార్కులను అభివృద్ధి చేయకుండా కబ్జాదారులను అడ్డంకులు సృష్టిస్తున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు పార్కు చుట్టూ ప్రహరీని నిర్మించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీనిపై హైడ్రా ప్రజావాణికి స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా రంగంలోకి దిగి లేఔట్ ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి విచారణ చేపట్టింది. గురువారం కబ్జాలను తొలగించి పార్కు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పార్కులను కాపాడినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు.