తడిసిన వడ్లు మద్దతు ధరకు కొనాలె

తడిసిన వడ్లు మద్దతు ధరకు కొనాలె

​​​​​​హైదరాబాద్, వెలుగు:తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేదంటే టీఆర్​ఎస్ నేతల్ని రైతులు తరిమికొడ్తరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తడిసిన, తేమ ఉన్న, మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాన్ని బేషరతుగా సేకరించాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం, ప్రధాని మోడీ మొండి వైఖరి వల్లనే రైతులు నష్టపోయారని అన్నారు. అందుకే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. చంచల్​గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతల్ని కలిసేందుకు రాహుల్​గాంధీకి అవకాశం ఇవ్వాలని డీజీపీ మహేందర్​రెడ్డిని కోరేందుకు గురువారం రేవంత్​ నేతృత్వంలో కాంగ్రెస్​ బృందం డీజీపీ ఆఫీసుకు వెళ్లింది. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. టార్పాలిన్ షీట్లను సమకూర్చితే వడ్లు తడిసే పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వడ్లు నింపడానికి గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్​హౌస్​ వీడి కల్లాల్లోకి పోయి రైతుల కన్నీళ్లు తుడవాలన్నారు. 

ముందు చాలెంజ్ విసిరింది మేమే

డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ బృందం లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్​ను కలిసి వినతి పత్రం అందజేసింది. అందర్ని కాకపోయినా రాహుల్​ ఒక్కరినైనా అనుమతించాలని కోరినట్లు రేవంత్ తెలిపారు. లేనిపక్షంలో మూకుమ్మడిగా వెళ్లి కలుస్తామని ఆయన అన్నారు. వారానికి రెండు సార్లు ములాఖత్ ఇవ్వాలని, రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారుల సంగతి తర్వాత చూస్తామన్నారు. ఏడాదిలో అధికారంలోకి రాబోయేది తామేనని ఆయన హెచ్చరించారు. సిటీలో రాహుల్ ఫొటోలతో వైట్ చాలెంజ్ పేరిట వెలసిన పోస్టర్ల గురించి ప్రశ్నించగా రేవంత్​ స్పందిస్తూ ముందు చాలెంజ్ విసిరిందే తామన్నారు. కేటీఆర్ కోసం తాము నాలుగు గంటల పాటు గన్​పార్క్​ వద్ద ఎదురుచూశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్​కు దమ్ముంటే ఆయన రక్తం, వెంట్రుకల నమూనాలను పరీక్షలకివ్వాలని డిమాండ్​ చేశారు. రేవంత్​ వెంట వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, సంపత్​కుమార్, మధు యాష్కీ, మానవతా రాయ్ ఉన్నారు.

యాదగిరి నర్సన్న కూడా కేసీఆర్​కి బలైపోయాడు

కేసీఆర్​ కుటుంబ అవినీతికి యాదగిరి నరసింహ స్వామి కూడా బలైపోయారని రేవంత్ అన్నారు.జూబ్లీహిల్స్ లోని ఎల్​వీ ప్రసాద్​ స్టూడియోలో రైతు సంఘర్షణ సభ సందర్భంగా గాంధీ కుటుంబ త్యాగాలపై  రూపొందించిన పోస్టర్, ఆడియో ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు.   గుడి నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు. రెండు వేల కోట్లతో నిర్మించిన దేవాలయంలో కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు. అమరుల స్థూపంలో కూడా ఇదే రకమైన అవినీతి జరిగిందన్నారు. 

పోలీసులు లేనిదే ఎందుకు తిరగలేకపోతున్నరు?

పోలీసు పహారా లేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చిందని మంత్రి హరీశ్ రావును రేవంత్ ప్రశ్నించారు. జిల్లాల్లో పర్యటన సమయంలో పోలీసులు పొలాల్లో పని చేస్తున్న రైతులను కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజా సేవలో కాంగ్రెస్ చేసిన ఎన్నో త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావని గురువారం ట్వీట్​లో పేర్కొన్నారు. రాహుల్​ని విమర్శించే స్థాయి హరీశ్​కు లేదన్నారు.