సర్కారీ బడిలో చదివితే 24 మార్కులు యాడ్

సర్కారీ బడిలో చదివితే 24 మార్కులు యాడ్
  • బాసర ట్రిపుల్ఐటీ అడ్మిషన్లలో మళ్లీ మార్కుల విధానం
  • ఒక్కో సబ్జెక్టులో కలవనున్న నాలుగు మార్కులు 
  • అడ్మిషన్లలో కీలకం కానున్న మ్యాథ్స్, సైన్స్ మార్కులు 
  • నేడు ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ 

హైదరాబాద్, వెలుగు: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) అడ్మిషన్లలో ఈ ఏడాది నుంచి మార్కుల విధానం అమల్లోకి రానుంది. ఈసారి టెన్త్‌‌‌‌‌‌‌‌లో జీపీఏ విధానాన్ని తొలగించి మార్కుల విధానం తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా ఆర్జీయూకేటీ నిబంధనలను సవరిస్తున్నారు. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్ల భర్తీకి చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బాసరలోని మెయిన్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో 1,500 సీట్లను భర్తీ చేస్తుండగా, ఈ ఏడాది మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో కూడా క్యాంపస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా అక్కడ 180 సీట్లతో కొత్త క్యాంపస్ మొదలుపెట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల31 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు.

సర్కారు విద్యాసంస్థల్లో చదివితే 24 మార్కులు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి బాసరలో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. దీనిలో సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు డిప్రివేషన్ స్కోర్ విధానం తీసుకొచ్చారు. గత ఏడాది వరకు టెన్త్‌‌‌‌‌‌‌‌లో మార్కులకు బదులు గ్రేడ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చేవారు. అప్పట్లో సర్కారు బడుల్లో చదివే వారికి 0.4 గ్రేడ్ పాయింట్లు జోడించేవారు. తాజాగా మళ్లీ మార్కుల విధానం తీసుకొచ్చినందున, ఆరు సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున మొత్తం 24 అదనపు మార్కులు జోడించే విధానాన్ని అమలు చేయనున్నారు.

 గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్ (నాన్-రెసిడెన్షియల్) విద్యార్థులకు ఈ మార్కులు జోడించనున్నారు. ఉదాహరణకు, సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థికి 550 మార్కులు వస్తే, దాన్ని 574 మార్కులుగా పరిగణించనున్నారు. ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులకు 4 మార్కులు అదనంగా చేర్చనున్నారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులు లబ్ధి పొందుతారు.

కీలకం కానున్న మ్యాథ్స్, సైన్స్ మార్కులు

అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తారు.