సగం కెరీర్‌ ఆందోళనతోనే గడిపేశా

సగం కెరీర్‌ ఆందోళనతోనే గడిపేశా

న్యూఢిల్లీ: తన 24 ఏళ్ల కెరీర్‌‌లో ఓ పది, పన్నెండేళ్లు.. ఆందోళనతోనే గడిపానని ఇండియా క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ అన్నాడు. మ్యాచ్‌‌కు ముందు జరిగే ప్రిపరేషన్స్‌‌లో ఇవన్నీ భాగమని తెలుసుకున్న తర్వాత చాలా రిలాక్స్‌‌ అయ్యానని చెప్పాడు. కరోనా టైమ్‌‌లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్లేయర్లు ఎక్కువ కాలం బయో బబుల్‌‌లో ఉండటాన్ని ఆమోదించడం చాలా కీలకమన్నాడు. ‘మ్యాచ్‌‌ కోసం శారీరకంగా సిద్ధం కావడంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధం కావాలని నేను గ్రహించా. నేను గ్రౌండ్‌‌లోకి ఎంటర్‌‌ కాకముందే నా మైండ్‌‌లో ఆట స్టార్ట్‌‌ అయ్యేది. ఆ ఆందోళన చాలా హై లెవెల్‌‌లో ఉండేది. ఓ పది, పన్నెండేళ్లు ఈ ఆందోళనతోనే గడిపేశా. మ్యాచ్‌‌కు ముందు రోజు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఆ తర్వాత నా ప్రిపరేషన్‌‌లో ఇదంతా ఓ భాగమని అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. రాత్రి పడుకోలేని సమయాల్లోనూ పీస్‌‌పుల్‌‌గా ఉండేలా చూసుకునేవాడిని. ఇందుకోసం కొన్ని పనులు చేయడం ప్రారంభించా. షాడో బ్యాటింగ్‌‌ చేయడం, టీవీ చూడటం, వీడియో గేమ్స్‌‌ ఆడటం చేసేవాడిని. తెల్లవారుజామున లేచి ఓ కప్‌‌ టీ పెట్టుకోవడం, బట్టలు ఐరన్‌‌ చేసుకోవడం కూడా నా గేమ్ ప్రిపరేషన్‌‌లో ఓ భాగమే. మ్యాచ్‌‌కు ముందు రోజే నా బ్యాగ్‌‌ను సర్దుకునేవాడిని. ఇవన్నీ చేయమని మా బ్రదర్‌‌ చెప్పేవాడు. తర్వాత హ్యాబిట్‌‌గా మారిపోయింది. నేను ఇండియాకు ఆడిన లాస్ట్‌‌ మ్యాచ్‌‌కు ముందు కూడా ఇవన్నీ చేశా’ అని సచిన్‌‌ పేర్కొన్నాడు. ప్లేయింగ్‌‌ కెరీర్‌‌లో ఎత్తుపల్లాలు సహజమే అయినా.. వీటన్నింటిని అంగీకరించడం చాలా ఇంపార్టెంట్‌‌ అని అన్నాడు. ‘ఓ ఇంజ్యూరీని ఫిజియోలు, డాక్టర్లు ఎగ్జామిన్​ చేసినప్పుడు తప్పు ఎక్కడుందో  తెలిసిపోతుంది. మెంటల్‌‌ హెల్త్‌‌ విషయంలో కూడా అలాగే ఉండాలి. అప్స్‌‌ అండ్‌‌ డౌన్స్‌‌ను ఆమోదించడం చాలా కీలకం. ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. నేను ఆడే రోజుల్లో చెన్నైలోని ఓ హోటల్‌‌ స్టాఫ్‌‌ నా కోసం రూమ్‌‌కు దోష తీసుకొచ్చి టేబుల్‌‌ మీద పెట్టాడు. ఆ తర్వాత ఓ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్‌‌.. నా బ్యాట్‌‌ను రిస్ట్రిక్ట్‌‌ చేస్తుందని చెప్పాడు. తర్వాత ఆ విషయంపై నేను కూడా దృష్టి పెట్టా. అది కరెక్టేనని తేలింది. ఆ తర్వాత సరి చేసుకున్నా’ అని మాస్టర్‌‌ వ్యాఖ్యానించాడు. 2011 వరల్డ్​ కప్​ విక్టరీ.. తన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ క్రికెటింగ్​ డే అన్నాడు. ఆ రోజు తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.