
సంగారెడ్డి, వెలుగు: ఇద్దరు సొంత అన్నదమ్ములు సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. ఆర్టిస్టులుగా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్ చేసి సంగారెడ్డి పోలీసులకు దొరికిపోయారు. సంగారెడ్డి సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ కు చెందిన గోరం అనిల్ (25), గోరం సునీల్ (23) ఇద్దరు అన్నదమ్ములు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ పటాన్ చెరు గౌతమ్‌నగర్‌లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు.
ఈ నెల 22న సంగారెడ్డి అయ్యప్ప కాలనీ రోడ్ నెంబర్ 2లో బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు ఇందూరి లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులైన అన్నదమ్ములు అనిల్, సునీల్ ను సోమవారం పట్టుకుని రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి ఒక బైక్, 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.