బస్టాండ్లు కిటకిట .. సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

 బస్టాండ్లు కిటకిట .. సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

హైదరాబాద్, వెలుగు:  సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లె బాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా, ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ ప్రాంతాలు శుక్రవారం కిటకిటలాడాయి. లక్షల మంది పబ్లిక్ తమ ఊర్లకు తరలుతున్నారు. రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదని ప్యాసింజర్లు చెబుతున్నారు. అయితే, రద్దీకి అనుగుణంగా బస్సులు నడుతుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. 

ఎప్పటికప్పుడు రద్దీని గమనిస్తూ ఉన్నతాధికారులకు ఆర్టీసీ అధికారులు సమాచారం ఇస్తున్నారని, ఆ మేరకు బస్సులు పెంచుతున్నామని ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజన్ శ్రీధర్ తెలిపారు. సంక్రాంతికి 38 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​ తెలిపారు. కాగా, శనివారం కూడా ఇదే రద్దీ ఉంటుందని ఆర్టీసీ, రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైనా భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ను క్లియర్ చేస్తున్నారు.  

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ 

రైల్వే, ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను దోచుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్యాసింజర్లు చెబుతున్నారు. రూల్స్​కు విరుద్ధంగా అనుమతి లేకుండా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్​ను ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తూ సీజ్ చేస్తున్నారు. కాగా, లక్షల మంది పబ్లిక్ పండుగకు ఊర్లకు వెళ్తుండటంతో జంట నగరాలు ఖాళీ అవుతున్నాయి. సిటీ రోడ్లలో ట్రాఫిక్ తగ్గుముఖం పడుతోంది. శనివారం సిటీ ఇంకా ఖాళీ అవుతుందని, మరో ఐదు రోజుల పాటు పట్నంలో రోడ్లు ఖాళీగా కనిపించనున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.