హనుమకొండ జిల్లా జానకిపురం గ్రామ సర్పంచ్ నవ్య–ఎమ్మెల్యే రాజయ్య మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రస్తుతం రాజకీయంగా మాత్రం వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. జూన్ 28వ తేదీ బుధవారం ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్యకు రూ.25 లక్షల సీడీఎఫ్ నిధుల ప్రోసిడింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఈ నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారామె. అంతేకాదు ఎమ్మెల్యే రాజయ్య వద్ద తన భర్త తీసుకున్న రూ.7 లక్షల తిరిగి ఇస్తమని స్పష్టం చేశారామె. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటి వరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
తాము ఏనాడు డబ్బుల కోసం ఆశ పడలేదని, ఆత్మగౌరవం కోసం పోరాడతామని తెలిపారు. తమ ఆస్తులను అమ్ముకుని మరీ గ్రామ అభివృద్ధి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను చట్టప్రకారం పోరాడుతానని, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా ఎమ్మెల్యే రాజయ్యపై న్యాయ పోరాటం కొనసాగిస్తాను సర్పంచ్ నవ్య పేర్కొన్నారు.
