- ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
భద్రాచలం, వెలుగు: ఏపీలో కలిపిన కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో ఆమె శుక్రవారం విలీన పంచాయతీల ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో కలిసి రేల నృత్యాలు చేశారు. అనంతరం చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్ హాలులో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినా సంతోషం లేకుండా పోలవరం పేరిట ఏడు మండలాలను ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో విలీనం చేశారని ఆరోపించారు. భద్రాచలం చుట్టూ ఉన్న విలీన పంచాయతీలు కనీస సౌలత్లకు నోచుకోవడం లేదన్నారు. భద్రాచలం రాముని మాన్యం కూడా ఇక్కడే ఉందన్నారు.
ఆదివాసీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గిరిజన కార్పొరేషన్లో 30 ఏళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవని కవిత అన్నారు. గిరిజనాభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మణుగూరు ఏరియాలోని పెద్దిపల్లి గొత్తికోయ గూడెంలో 72 కుటుంబాలను సింగరేణి సంస్థ రోడ్డున పడేసిందని, వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదని, కేవలం రూ.1లక్ష మాత్రమే ఇచ్చారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు వల్ల జిల్లాకు చుక్కనీరు రావడం లేదన్నారు. నాగార్జున సాగర్ నీళ్లు ఖమ్మంకే తరలించడం సరైందికాదన్నారు.
