ఐమ్యాక్స్ దగ్గర మరో పీపుల్స్ ప్లాజా!.. ఏర్పాటుకు హెచ్ఎండీఏ సన్నాహాలు

ఐమ్యాక్స్ దగ్గర మరో పీపుల్స్ ప్లాజా!..  ఏర్పాటుకు హెచ్ఎండీఏ సన్నాహాలు
  • ఐమ్యాక్స్, అంబేద్కర్​ స్టాచ్యూ మధ్యన ఖాళీ స్థలంలో ఏర్పాటు
  • ఎగ్జిబిషన్లు, ఈవెంట్ల నిర్వహణ కోసం.. 

హైదరాబాద్​సిటీ, వెలుగు:  నెక్లెస్​రోడ్​లోని పీపుల్స్​ప్లాజా అంటే తెలియని వారు ఉండరు. ఎగ్జిబిషన్లు, వినోద కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర ఈవెంట్ల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ దీన్ని ఏర్పాటు చేశారు. ట్యాంక్​బండ్​కు ఆనుకుని ఉన్న ఈ విశాలమైన స్థలంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే మరో ఈవెంట్​సెంటర్​ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్​మార్గ్​లోని భారీ అంబేద్కర్​విగ్రహం, ఐమ్యాక్స్​థియేటర్​కు మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో పీపుల్స్​ప్లాజా వంటి మరో ఈవెంట్​సెంటర్​ను తీర్చిదిద్దుతున్నారు. 

3.8 ఎకరాల్లో ఈవెంట్​ సెంటర్​

ఐమాక్స్​కు ఆనుకుని ఉన్న హెచ్ఎండీఏ స్థలం దాదాపు 3.8 ఎకరాలు ఉండడంతో దీన్ని ఇప్పుడు చదును చేయిస్తున్నారు. ఈ ప్లేస్​లో పీపుల్స్​ప్లాజా మాదిరిగానే ఎగ్జిబిషన్లు, సమావేశాలు, ఈవెంట్లు నిర్వహించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం నగరంలో భారీ సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇందులో కొన్నింటిని నెక్లెస్​రోడ్, పీపుల్స్​ ప్లాజా, ఎన్టీఆర్​స్టేడియంలలో నిర్వహిస్తున్నారు. మరి కొందరు అవసరమైన స్థలం దొరక్క శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎన్టీఆర్​మార్గ్​లో నిర్మిస్తున్న ఈవెంట్​సెంటర్​పూర్తయితే అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని, హెచ్ఎండీఏకు ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు. వాహనాల పార్కింగ్​కు కూడా ప్లేస్​ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉంటుందంటున్నారు. 

ఖాళీగా అనేక స్థలాలు 

ఎన్టీఆర్​ గార్డెన్స్, లుంబినీ పార్క్, నెక్లెస్​రోడ్​లోని అనేక ప్రాంతాల్లో హెచ్ఎండీఏకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు ఆయా స్థలాల్లో షాపులు, ఫుడ్​కోర్టులు, పెడుతున్నారు. దీనివల్ల స్థలాలు ఉన్నా ఉపయోగించుకోలేక హెచ్ఎండీఏకు ఆదాయం రాకుండా పోతోంది. పైగా కొన్ని స్థలాను కొందరు అక్రమంగా పార్కింగ్​కు వాడుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఐమాక్స్​పక్కనున్న భూమిని కాపాడడంతో పాటు సంస్థకు ఆదాయం తెచ్చేందుకు ఈవెంట్ సెంటర్​ఏర్పాటు చేయాలని ప్లాన్లు సిద్ధం చేసింది.