రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల గోడును ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు ఎన్నో ఏళ్లుగా పనిచేసి ఇంటర్ విద్యాభివృద్దికి చేసిన కృషి గంగలో కలిసిపోయింది. టీజీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ లెక్చరర్ల నియామకంతో అనేక మంది గెస్ట్ లెక్చరర్లు రోడ్డున పడ్డారు. 1654 మంది గెస్ట్ లెక్చరర్లలో రెగ్యులర్ లెక్చరర్లు జాయిన్ కాని కాలేజీల్లో, కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో మాత్రమే కొందరు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తుండగా మిగిలిన వారందరూ రోడ్డు పాలయ్యారు. పీజీలు, బీఈడీ లు వంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగ భద్రత లేక, చేసిన పనికి నెలల తరబడి జీతాలు రాక తీవ్ర మానసిక ఒత్తిడికిగురై కుటుంబ పోషణ భారమై గెస్ట్ లెక్చరర్లు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఇటీవల కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా, చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా కొందరు గెస్ట్ లెక్చరర్ల బాధలు వినరావడం విషాదం. ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి వారిని పట్టించుకోలేదు. 12 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు మానసికంగా కృంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నా అటు ఇంటర్ బోర్డు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం మరింత దారుణం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని ఆదుకోవాలి. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించి వారి జీవితాలను కాపాడాలని వేడుకుంటున్నాం.
- ముంత శివలీల,
గెస్ట్ లెక్చరర్, వనపర్తి జిల్లా
