వ్యక్తిగత సమాచారం..-ఆర్టీఐ మినహాయింపులు!

వ్యక్తిగత సమాచారం..-ఆర్టీఐ మినహాయింపులు!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత,  జవాబుదారీతనం అత్యంత కీలకమైన అంశాలు.  వీటిని సాధించడానికి  కేంద్ర ప్రభుత్వం 2005లో  సమాచార హక్కు చట్టాన్ని (ఆర్‌‌టీఐ) చేసింది.  ప్రభుత్వ వ్యవహారాలలో  గోప్యతను తగ్గించి,  ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకొనిరావడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వశాఖలు, సంస్థలు, స్థానిక సంస్థలు నిర్వహించే కార్యకలాపాలు, ఖర్చులు, విధానపరమైన నిర్ణయాలపై సమాచారం కోరే హక్కు పౌరుడికి ఈ చట్టం ద్వారా లభించింది.  అవినీతి నివారణ, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం, పాలనలో పారదర్శకత పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారులుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సైతం ఈ చట్టం నిర్దేశించింది.  

సాధారణ పౌరుడిని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది ఈ సమాచార హక్కు చట్టమే. అభివృద్ధి పనులు,  నిధుల కేటాయింపు- ఖర్చు,  సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ నిర్ణయాల వెనుక కారణాలు తెలుసుకునే అవకాశం పౌరులకు కల్పించింది. ఆర్‌‌టీఐ చట్టం  ప్రజల హక్కులను పరిరక్షిస్తూ, పాలనలో గోప్యతను నివారించి, పారదర్శక  పాలనకు బలమైన ఆయుధంగా నిలిచింది. అయితే, ఈ సమాచార హక్కు పరిపూర్ణమైనది కాదు. కొన్ని సందర్భాల్లో  వ్యక్తిగత గోప్యత (రైట్ టు ప్రైవసీ)ని కూడా సమానంగా పరిరక్షించాలి. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బుక్, సర్టిఫికెట్స్, ఇన్కమ్ టాక్స్ వివరాలు, ఐటీ ఫారం-16 వంటి సమాచారం ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇవ్వడంపై తరచుగా వివాదాలు ఏర్పడుతున్నాయి.

సర్వీస్ బుక్ ఇవ్వొచ్చా?

సర్వీస్ బుక్‌‌లో ఉద్యోగి పర్సనల్ ఇన్ఫర్మేషన్, నియామకం, పదోన్నతులు, జీతభత్యాలు, సెలవులు, క్రమశిక్షణ చర్యలు తదితర వివరాలు ఉంటాయి. సేవా పుస్తకాలు ప్రభుత్వ రికార్డులే అయినప్పటికీ, ప్రజలకు ఇవ్వాల్సినవేనా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.  కోర్టుల అభిప్రాయం ప్రకారం,  సర్వీస్ బుక్‌‌లోని  మొత్తం సమాచారం ఉద్యోగి వ్యక్తిగత సమాచారంగా పరిగణించాలి.  ముఖ్యంగా, ఉద్యోగి వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యుల వివరాలు, ఆరోగ్యం, సెలవులు, పుట్టిన తేదీ, సర్వీసుపై ఉన్నతాధికారుల అంతర్గత వ్యాఖ్యలు, డిసిప్లినరీ యాక్షన్స్ వంటి అంశాలు వ్యక్తిగత గోప్యతకు చెందినవి. అదే విధంగా, ఉద్యోగుల విద్యార్హతలు, కులం, ఇతర పర్సనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు కూడా సాధారణంగా థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని కోర్టులు స్పష్టం చేశాయి. ఐటీ ఫారం–16, ఆదాయ వివరాలు ఉద్యోగి ఆర్థిక స్థితిని వెల్లడిస్తాయి. ఇవి పూర్తిగా వ్యక్తిగతమైనవి. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు పలు కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో,  ఆదాయ పన్ను వివరాలు వ్యక్తిగత సమాచారంగా స్పష్టంగా పేర్కొన్నాయి. అలాంటి సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా ఇతరులకు ఇవ్వడం ఉద్యోగి గోప్యతకు భంగం కలిగిస్తుందని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి.

ఆర్‌‌టీఐ సెక్షన్ 8(1)(జె)

ఆర్‌‌టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) చాలా కీలకమైనది.  ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అది ప్రజా కార్యకలాపానికి లేదా ప్రజా ప్రయోజనానికి సంబంధం లేకపోతే, లేదా ఆ సమాచారాన్ని ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగితే, అటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు కూడా ఉంది. సదరు సమాచారాన్ని వెల్లడించడం వల్ల లార్జర్  పబ్లిక్ ఇంటరెస్ట్ ఉందని అధికారులు విశ్వసిస్తే,  వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఇవ్వవచ్చు. ఉదాహరణకు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం వంటి సందర్భాల్లో గోప్యత కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యమవుతుంది.

కోర్టు తీర్పులు

ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8(1)(జె) విస్తృతిపై వివిధ హైకోర్టులు సహా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది.  గిరీష్  రామచంద్ర  దేశ్‌‌పాండే వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (2013) ప్రభుత్వ ఉద్యోగుల ఐటీ రిటర్న్స్, సర్వీస్ బుక్, అప్రైజల్ రిపోర్ట్స్, డిపార్ట్‌‌మెంటల్ ప్రొసీడింగ్స్  వ్యక్తిగత సమాచారం  కిందికే వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ ఇంటరెస్ట్ లేకపోతే ఈ డాక్యుమెంట్లు ఆర్‌‌టీఐ ద్వారా ఇవ్వకూడదు. కెనరా బ్యాంకు వర్సెస్  సీఎస్ శ్యామ్ (2018) కేసులో ఉద్యోగుల సర్వీస్ రికార్డ్స్, పే స్కేల్, ప్రమోషన్, ట్రాన్స్‌‌ఫర్ వంటి వివరాలు వ్యక్తిగతమైనవని, వీటిని ఇవ్వాలంటే ప్రజా ప్రయోజనాన్ని స్పష్టంగా చూపించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ (2019) కేసులో  పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భాల్లో రైట్ టు ప్రైవసీ, ఆర్‌‌టీఐ చట్టాన్ని సమతుల్యంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్  కమిషనర్ కేసులో ఉద్యోగుల సర్వీస్ బుక్స్, ఐటీ రిటర్న్స్, లీవ్, ఇంక్రిమెంట్లు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, షోకాజ్ నోటీసులు, పనిష్‌‌మెంట్స్ వివరాలు వ్యక్తిగత సమాచారం క్రిందికి వస్తాయనీ, ఆర్‌‌టీఐ సెక్షన్ 8(1)(జె) ప్రకారం సదరు వివరాలు/డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు 4 అక్టోబర్, 2024 నాడు తీర్పు చెప్పింది.

రైట్ టు ప్రైవసీ

సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన అతని ప్రతి సమాచారం ప్రజలకు చెందదు. పబ్లిక్ డాక్యుమెంట్స్ కావు.  సర్వీస్ బుక్, ఆదాయ పన్ను వివరాలు, సర్టిఫికెట్స్, ఐటీ ఫారం-16, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ఆర్‌‌టీఐ సెక్షన్ 8(1)(జె) ప్రకారం సాధారణ పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారమే. అవినీతి, అక్రమ నియామకాలు, నకిలీ సర్టిఫికెట్లు వంటి అసాధారణ పరిస్థితులు, ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత ఉద్యోగుల ఈ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవచ్చు. ఎలాంటి పబ్లిక్ ఇంటరెస్ట్ లేకుండా కేవలం సాధారణ ఆసక్తి, వ్యక్తిగత ద్వేషం లేదా స్వలాభం కోసం ఆర్‌‌టీఐ చట్టం క్రింద దరఖాస్తు చేసిన పక్షంలో అటువంటి అభ్యర్థనలను అధికారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. ఆర్‌‌టీఐ చట్టం పారదర్శకతకు ఆయుధం అయినప్పటికీ, అది వ్యక్తిగత గోప్యతను నాశనం చేయడానికి కాదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ సమాచారం ఇచ్చేముందు  రైట్ టు ప్రైవసీ వర్సెస్ పబ్లిక్ ఇంటరెస్ట్ మధ్య సమతుల్యత పాటించాలి. 

- మానేటి ప్రతాపరెడ్డి,
గౌరవాధ్యక్షుడు, టీఆర్‌‌టీఎఫ్