సీతారామ డిస్ట్రిబ్యూటరీలతోనే.. ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

సీతారామ డిస్ట్రిబ్యూటరీలతోనే.. ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి
  • రోప్ వే నిర్మాణ పనులు నాణ్యతతో డిసెంబర్ 2026 నాటికి పూర్తి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు : సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు  కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టితో కలిసి ఖిల్లా రోప్ వే, సింథటిక్ ట్రాక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శిల్పారామం, క్రికెట్ స్టేడియం, యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం, మెడికల్ కాలేజీ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి, మున్నేరు రిటైనింగ్ వాల్, సమీకృత మార్కెట్, మంచుకొండ ఎత్తిపోతల పథకం, హరిత హోటల్, టీటీడీ ఆలయం, స్వామి నారాయణ గురుకుల స్కూల్, సీతారామ ఎత్తిపోతల పథకం, వెలుగు మట్ల అర్బన్ పార్క్ పనులపై ఆఫీసర్లతో సమీక్షించారు.

 ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు కోసం బడ్జెట్ ఎస్టిమేట్స్ గతంలోనే పెంచామన్నారు. పది నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. 101 కిలోమీటర్ల వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణ పనులు సైతం ప్రారంభించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్​ నాటికి ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 25 వేల ఎకరాల నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. 

పాలేరుకు లింకు కెనాల్ కు నీరు  వచ్చేలా సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 13,14, 15,16 పనులు జరగాలని సూచించారు. జూలూరుపాడు టన్నెల్ టెండర్ పూర్తి చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని, అదే సమయంలో ప్యాకేజీ 16 పాలేరు లింక్ కెనాల్ పెండింగ్ 4 కిలోమీటర్లు పనులు, ప్యాకేజీ 13, 14 అటవీ క్లియరెన్స్ సాధించి ఆ పనులు సైతం సమాంతరంగా పూర్తి చేయాలని చెప్పారు. భవిష్యత్​లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇబ్బందులు వస్తే సీతారామఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటి సరఫరా చేయగలమని, దానికి సంబంధించిన అనుమతులు సాధించేలా ఫాలో అప్ చేయాలన్నారు. 

సత్తుపల్లి ట్రంకు, 4వ పంప్ హౌస్, పాలేరు టన్నెల్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. పచ్చదనం పెంచేందుకు గ్రామాల్లో ప్రణాళికా బద్ధంగా మొక్కలు నాటాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

49 శాతం పూర్తయిన మున్నేరు నది రిటైనింగ్ వాల్ 

మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం 49 శాతం పూర్తయిందని, నాగార్జున సాగర్ కాల్వ నుంచి ప్రకాశ్​నగర్ బ్రిడ్జి వరకు ప్రాధాన్యత ప్రకారం మున్నేరు నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం క్రింద రూ.66 కోట్లతో మంజూరు చేసిన పనులు మార్చి నాటికి  పూర్తి చేసి 29 చెరువులు నింపే పనులు పూర్తి కావాలన్నారు. మంచుకొండ లిఫ్ట్ రెండవ విడత క్రింద మరో 17 చెరువులు నింపే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

 మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఎన్​ఎస్పీ  భూముల బదలాయింపు, డ్రైయిన్ నిర్మాణ డిజైన్ ఆమోదం పనులు రాబోయే కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించేలా చూడాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి ఫోన్​ లో విజ్ఞప్తి చేశారు. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు ఉండాలని, మార్కెట్ యార్డులో విస్తరణ పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని, షెడ్డుల నిర్మాణం ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేయాలని తుమ్మల ఆదేశించారు. 

మార్కెట్ చుట్టూ ఆక్రమణలను తొలగించి ప్రజలకు పరిహారం అందేలా చూడాలన్నారు. అకాల వర్షం కురిసిన మిర్చి బస్తాలు తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు తీసుకోవాలన్నారు. పార్క్ భూమి అన్యాక్రాంతం కాకుండా ఫెన్సింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖిల్లా రోప్ వే నిర్మాణం పనులను నాణ్యత తో పూర్తి చేయాలని, పనులను థర్డ్ పార్టీతో ఆడిట్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి బిల్లులు సమర్పించిన 24 గంటల వ్యవధిలో క్లియర్ చేస్తున్నామని, నిధుల కొరత లేనందున ఏజెన్సీలో నిర్మాణ పనులను నాణ్యతతో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్ఓ ఏ. పద్మశ్రీ పాల్గొన్నారు.

ప్రతీ అంశాన్ని పరిశీలించాలి..

ఖిల్లా రోప్ వే పనులు ప్రస్తుతానికి 20 శాతం పని జరిగిందని, రోప్ వే లో వాడే మెటిరియల్ తయారీ దశలో ప్రతి అంశాన్ని అధికారులు నిశితంగా పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. హైదరాబాద్​ తరహాలో ఖమ్మంలో శిల్పారామం నిర్మాణానికి 5 ఎకరాల 2 గుంటల భూమి కేటాయించామని చెప్పారు. 20 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయాలన్నారు. మున్నేరు కేబుల్ బ్రిడ్జి పనులలో 10 స్లాబ్ లు పూర్తి చేశామని, పెండింగ్ 5 స్లాబ్ లు, 4 లైన్ల రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని ఆదేశించారు. 

జూన్ నాటికి కేబుల్ బ్రిడ్జిను ప్రజల వినియోగంలోకి తీసుకొని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు నిర్ణిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటి కప్పుడు కలెక్టర్ కు అప్ డేట్ చేయాలని సూచించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు 3 బ్లాక్ లలో, గర్ల్స్ హాస్టల్, ప్రిన్సిపాల్ భవనం, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ పనులు సమాంతరంగా చేపట్టాలని, వీటిని జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.