- ఉభయ సభలు నిరవధిక వాయిదా
- ప్రకటించిన లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్
- 19 రోజుల పాటు సాగిన పార్లమెంట్ వింటర్ సెషన్
- 8 కీలక బిల్లులు పాస్..
- ఉభయ సభల్లో 40 శాతం టైమ్ చర్చలకే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఇటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అటు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెషన్ చివరి రోజు లోక్‌సభలో వందేమాతరం ఆలపించారు. రాజ్యసభ కూడా అదేవిధంగా ముగిసింది. దీనికి ముందు స్పీకర్ ఓం బిర్లా వింటర్ సెషన్‌పై బ్రీఫింగ్ ఇచ్చారు. డిసెంబర్ 1న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు 19 రోజుల పాటు కొనసాగాయి.
ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. 20 ఏండ్ల నాటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం, అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు కొత్త బాధ్యతలు అప్పగించడం వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయ విమర్శలు, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ సెషన్ మొత్తం వాడీవేడిగా కొనసాగింది. ప్రభుత్వం మొత్తం 14 బిల్లులను లక్ష్యంగా పెట్టుకోగా 8 బిల్లులు పాస్ అయ్యాయి.
అత్యంత కీలకమైన బిల్లులకు లోక్‌సభ, రాజ్యసభలో గ్రీన్ సిగ్నల్ లభించాయి. 19 రోజుల సెషన్‌లో 15 సెషన్స్ జరిగాయి. లోక్‌సభ 92 గంటల 25 నిమిషాల పాటు నడిచింది. ఈ సెషన్‌లో లోక్‌సభ ప్రొడక్టివిటీ 111 శాతంగా నమోదైంది.
ఉభయ సభల్లో పాసైన కీలక బిల్లులు
20 ఏండ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ లేదా ‘వీబీ జీ-రామ్-జీ’ అనే కొత్త బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. ఇది 125 రోజుల ఉపాధి హామీ ఇస్తుందని ప్రభుత్వం చెప్తుండగా.. పాత చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని అనుమతించే ‘సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (శాంతి) బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచే ‘సబ్ కా బీమా సబ్ కీ రక్షా’ సవరణ బిల్లుకు ఉభయ సభలూ ఆమోదం తెలిపాయి.
ఠాగూర్ అవమానంతో ప్రారంభించి.. గాంధీతో ముగించారు: కాంగ్రెస్
ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించడంతో పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించి, గాంధీని అవమానించడంతో ముగించిందని కాంగ్రెస్ విమర్శించింది. ‘‘సమావేశాల ప్రారంభంలో ‘వందేమాతరం’ గేయంపై జరిగిన చర్చలో ఠాగూర్ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ తప్పబట్టింది.
ఇది దేశాభిమానాన్ని, ఠాగూర్ వంటి మహనీయులను అవమానించడమే. ఆధునిక భారతాన్ని నిర్మించిన ఠాగూర్, నెహ్రూ, గాంధీలను అవమానించడమే మోదీ వ్యూహం’’ అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు.
