- నకిలీగా గుర్తించిన కెనరా బ్యాంకు అధికారులు
- ఆ రైతు తాజాగా ఎన్నికైన సర్పంచ్ సమీప బంధువు
- పంచాయతీ ఎన్నికల్లో పంచినట్టుగా అనుమానాలు
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఫేక్ నోట్లు కలకలం రేపాయి. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం జలాల్పూర్గ్రామానికి చెందిన రైతు నెరెడ్ల చిన్నసాయిలు శుక్రవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు రూ.2 లక్షల 8,500 నగదు తన అకౌంట్ లో జమ చేసేందుకు ఇచ్చాడు. అధికారులు తీసుకుని రూ. 500 నోట్లు అన్నీ ఫేక్ గా గుర్తించారు. వెంటనే రైతును నిలదీయడంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
బ్యాంకు ఆఫీసర్లు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ చార్జ్ ఎస్ఐ రాజు తెలిపారు. కాగా.. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ. 3 వేలు వరకు ఇచ్చారని జలాల్పూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
దొంగ నోట్ల మాఫియా పనా.. లేక రాజకీయ పార్టీలదా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ నోట్లు ఇచ్చిన రైతు చిన్న సాయిలు.. తాజాగా ఎన్నికైన జలాల్పూర్సర్పంచ్కు సమీప బంధువు కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపితే దోషులు ఎవరనేది తేలుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు.
