- లిస్ట్ సిద్ధం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
- సీఎం ఆమోదించగానే ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ త్వరలోనే 25 నుంచి 30 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పదవుల భర్తీపై శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇద్దరు సమావేశమై తుది జాబితాపై కసరత్తు చేశారు. చివరకు 25 నుంచి 30 మందితో ఫైనల్ జాబితాను రెడీ చేశారు. దాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి పంపించారు. ఆ జాబితాను సీఎం పరిశీలించి, ఆమోద ముద్ర వేయగానే నియామకపు ప్రకటన వెలువడనున్నది.
ఈ వారం రోజుల్లోపే ప్రకటన రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ కార్యవర్గంలోని పదవులపై కూడా ఈ సందర్భంగా పీసీసీ చీఫ్, పార్టీ ఇన్చార్జి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అవి కూడా ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు నామినేటెడ్.. అటు పార్టీ పదవుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎక్కువ పదవులు వచ్చేలా జాబితాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40 వరకు కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది. మిగిలిన పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పడు ఖాళీగా ఉన్న 50 కిపైగా నామినేటెడ్ పోస్టులకుగానూ 25 నుంచి 30 వరకు భర్తీ చేయనున్నారు. మిగిలినవి కొత్త సంవత్సరంలోనే అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది.
కార్యకర్తలతో మీటింగ్
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఫలితాలు, జనం స్పందనపై ఆరా తీశారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతున్నదని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏస్థాయిలో చేరుతున్నాయనే దానిపై ఆరా తీశారు. పార్టీ కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు తప్పక ఉంటుందని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ వారికి భరోసా ఇచ్చారు.
