రైల్వేల భద్రతపై ఎస్సీఆర్ జీఎం సమీక్ష

రైల్వేల భద్రతపై ఎస్సీఆర్ జీఎం సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రైల్వే కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. సోమవారం సికింద్రాబాద్​లోని రైల్ నిలయంలో ఈ మీటింగ్ జరిగింది. సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధికారులతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ట్రాక్ నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో భద్రతను మెరుగుపర్చాలని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. రైల్వే కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. జోన్ వ్యాప్తంగా భద్రతా చర్యలను పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు అగ్నిమాపక భద్రతకు సంబంధించి ఎఫ్ఎస్ డీఎస్ (ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టమ్) పనితీరుపై జోన్‌‌‌‌లో చేపట్టిన ప్రత్యేక భద్రతా డ్రైవ్‌‌‌‌ల గురించి జనరల్ మేనేజర్‌‌‌‌కు వివరించారు.