Akshay Kumar: హీరో అక్షయ్ కుమార్ భద్రతా వాహనం బోల్తా.. త్రుటిలో బయటపడిన దంపతులు!

Akshay Kumar: హీరో అక్షయ్ కుమార్ భద్రతా వాహనం బోల్తా.. త్రుటిలో బయటపడిన దంపతులు!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బందికి చెందిన వాహనం ముంబైలో ప్రమాదానికి గురైంది. జుహులోని థింక్ జిమ్ సమీపంలో సోమవారం రాత్రి (2026 జనవరి 19) సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోమవారం రాత్రి జుహు ప్రాంతంలో వేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనం, ఆయన భద్రతా కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత కారణంగా ఎస్కార్ట్ వాహనం బోల్తా పడినట్లు సమాచారం.

అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా విదేశీ పర్యటన ముగించుకుని ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నటుడు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ప్రమాదం నుంచి వారు క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. ఆటో డ్రైవర్‌కు గాయాలు కావడంతో అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే జుహు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మెర్సిడెస్ కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపం కారణమా అనే అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటివరకు అక్షయ్ కుమార్ పీఆర్ బృందం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రమాదం జరిగిన కొంతసేపటికి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకొచ్చారు.