చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్

 చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్
  • ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

హుస్నాబాద్, వెలుగు: పట్టణంలోని చారిత్రక కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు ఎల్లమ్మ చెరువు కాల్వల ఆధునీకరణ కోసం రూ. 10.23 కోట్ల  నిధులను మంజూరు చేస్తూ ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చెరువు పునరుద్ధరణ, పర్యాటక అభివృద్ధి పనుల కోసం రూ. రూ.7.49 కోట్లు కేటాయించారు. ఎల్లమ్మ చెరువు అడ్డుకట్ట బలోపేతం, నీటిపారుదల కాల్వల పునరుద్ధరణ కోసం రూ. 2.74  కోట్లు  మంజూరు చేశారు.

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.