ఉక్రెయిన్ నిఘా అధికారి హత్య..దేశ రాజధాని కీవ్లో కాల్చి చంపిన దుండగుడు

ఉక్రెయిన్ నిఘా అధికారి హత్య..దేశ రాజధాని కీవ్లో కాల్చి చంపిన దుండగుడు

కీవ్: ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సీనియర్ అధికారి ఒకరు దేశ రాజధాని కీవ్ లో హత్యకు గురయ్యారు. రష్యాపై ఇటీవల భారీ ఎత్తున జరిగిన కోవర్ట్ డ్రోన్ దాడుల వెనక కీలక పాత్ర పోషించిన నిఘా అధికారి కల్నల్ ఇవాన్ వొరోనిచ్ ను శుక్రవారం కీవ్ లో ఓ దుండగుడు కాల్చి చంపాడని అధికారులు వెల్లడించారు. కీవ్ సిటీలో హోలోసివ్ స్కీ ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ నుంచి బయటకు వస్తున్న కల్నల్ ఇవాన్ వద్దకు మాస్క్ ధరించి వచ్చిన  ఓ దుండగుడు క్లోజ్ రేంజ్ లో ఐదు సార్లు కాల్పులు జరిపి, పారిపోయాడని తెలిపారు.

 కల్నల్ ఇవాన్ 2014 నుంచి ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ద్వారా రష్యాకు వ్యతిరేకంగా నిఘా అధికారిగా పని చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఇటీవల ఉక్రెయిన్ చేపట్టిన కోవర్ట్ డ్రోన్ దాడులతో రష్యాకు భారీ నష్టం వాటిల్లిందని, అందుకే ఈ ఆపరేషన్ వెనక కీలక పాత్ర పోషించిన కల్నల్ ఇవాన్ ను టార్గెట్ చేసి, హత్య చేసి ఉండొచ్చని పేర్కొంది.