'సీతారామం' చరిత్రలో నిలుస్తుంది 

'సీతారామం' చరిత్రలో నిలుస్తుంది 

హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా సీతారామం. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఒకేసారి విడుదల చేయనున్నట్లు యూనిట్ తెలిపింది. రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన చిత్రబృందం ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి.

సీతారామం మీ బ్యానర్ లో మరో 'మహానటి' అవుతుందని భావిస్తున్నారా ?

చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటి నుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ మరో చరిత్ర, మణిరత్నం గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.

ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గడానికి కారణం ఏంటని భావిస్తున్నారు ?

కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడమూ ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి.

ప్రొడక్షన్ అంతా మీ పిల్లలకి అప్పగించినట్లేనా ? నిర్మాణంలో వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లేనా?

ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపుగా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను ఈ సినిమాని అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు.  సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.

సీతారామంలో పాటలు అద్భుతంగా రావాడానికి కారణం సంగీతం పట్ల మీకున్న అభిరుచేనా?

నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్ ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. ''మీరు ఎదురుగా ఉంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ''అని మహదేవన్ అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా కూడా అన్నారు. మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం ఉంది. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ ఉంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు.

హను రాఘవపూడితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన డైరెక్టర్.  చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టుంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి.

తెలుగులో ఇంతమంది హీరోలు ఉండగా దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ?

మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం''అని స్వప్నతో అప్పుడే చెప్పాను.  హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు.

సీతారామంలో నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఉందా ?

 నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. అయితే కొన్ని సూచనలు ఇస్తుంటారు. తను సీతారామం చూసి అద్భుతంగా ఉందని చెప్పారు.

సుమంత్ పాత్ర గురించి ?

సుమంత్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది.

సీతారామంలో ఎన్ని పాటలు వఉన్నాయి ?

ఆరు పాటలు ఉన్నాయి. ఒకటి అర చిన్న బిట్ సాంగ్స్ నేపధ్యంలో వినిపిస్తాయి. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు వుంటుంది. సినిమా ఫాస్ట్ గా వుంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఒకేసారి విడుదలౌతుంది.

కొత్త గా చేయబోతున్న సినిమాలు

ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలౌతుంది.