ఎస్ఎల్బీసీ కల నెరవేరేనా?

ఎస్ఎల్బీసీ కల నెరవేరేనా?

నల్గొండ జిల్లా సరిహద్దుల గుండా 284 కి. మీ. కృష్ణానది ప్రవహిస్తున్నది. 100 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. అయినా, జిల్లా ప్రజలు సాగునీటికి, - తాగునీటికి నోచుకోవడం లేదు. -కరువు పీడిత ప్రాంతంగా, ఫ్లోరోసిస్ వ్యాధులకు గురవుతున్న ప్రజలకు కృష్ణా జలాలు అందటంలేదు.  నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా  కిందభాగంలో 9 మండలాల్లో  3.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది.  సాగు, -తాగు నీరందించాలని సుదీర్ఘ పోరాటాలు(1975–-80 వరకు), చేసిన పలితంగా చేపట్టిన పథకం ఎస్ఎల్బీసీ. 

ఎస్ఎల్బీసీకి రూపకల్పన

శ్రీశైలం జలాశయం నుంచి  సొరంగమార్గం ద్వారా నల్గొండ జిల్లా ఎగువ భాగానికి అందించవచ్చని నిపుణుల కమిటీ  1980లో  నివేదిక ఇచ్చింది. 1981లో  శ్రీశైలం ఎడమ గట్టు లోపలి భాగంలో 824 ఫీట్స్ లెవల్ నుంచి రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకొనేవిధంగా  సొరంగ మార్గం రూపొందించి ఆనాటి ముఖ్యమంత్రి  టి అంజయ్య శంకుస్థాపన చేశారు. ఈ పనులకు నూతన టెక్నాలజీతో  టీబీఎం ద్వారా  తవ్వడానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని, పర్యావరణ  తదితర అనుమతులు పొందాలని నిర్ణయించారు. అయితే, అనుమతులు పొందటంలో ఆలస్యం జరిగింది.

ఎస్ఎల్బీసీకి శంకుస్థాపన

1983లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎస్ఎల్బీసీ (ఎడమగట్టు)తోపాటు,  ఎస్ ఆర్ బీసీ (కుడిగట్టు) తెలుగు గంగకు 1983 మే 4న  శంకుస్థాపన చేశారు.  రూ. 484 కోట్లతో  పనులు చేపట్టేందుకు  శ్రీకారం చుట్టి కాలువలకు భూసేకరణ,  ఇంజినీరింగు  స్టాఫ్ క్వార్టర్స్,  హెడ్ ఆఫీస్ పనులు చేపట్టినప్పటికీ.. సొరంగ పనులు మొదలుపెట్టలేదు. తిరిగి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్  ప్రభుత్వం రావడంతో తిరిగి మొదటికొచ్చింది. 

1994లో మరోసారి టీడీపీ ప్రభుత్వం రావటంతో  సొరంగ పనులలో జాప్యంతో కనీసం 7, 8 సంవత్సరాలు పడుతుందని, అందుకు నాగార్జున సాగర్  లోతట్టు నుంచి  ఏఎంఆర్ (పుట్టాంగండి) ఎత్తిపోతలు చేపట్టడమైనది.   అక్కడి నుంచే  ప్రస్తుతం జిల్లాకు  దాదాపు 80 వేల ఎకరాలకు సాగు,  తాగునీరుతో పాటు  హైదరాబాద్​కు  తాగునీరు అందుతుంది. ఇదే కాలంలో చేపట్టిన ఎస్ఆర్బిసీ (తెలుగు గంగ)80 శాతం పనులు పూర్తి అయినవి.

ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని ఉద్యమాలు

నల్గొండ జిల్లా కోసం  చేపట్టి  పెండింగ్​లో  సాగుతున్న  ప్రాజెక్టును  పూర్తి చేయాలని రాజకీయ పార్టీలు,  జలసాధన సమితి ఒకవైపు,  ఫ్లోరోసిస్ నివారణకు కృష్ణా జలాలు అందించాలని, వివిధ రూపాలలో పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ధర్నాలు,  జిల్లా కలెక్టరేట్ ముట్టడి,  చలో అసెంబ్లీ,  స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరణ, 1996లో  నల్గొండ పార్లమెంటుకు 480 మంది పోటీతో ఉద్యమాలు తీవ్రతరం చేపట్టడంతో  ప్రభుత్వ పాలకులలో కదలిక మొదలైంది.

ఎస్ఎల్బీసీ పూర్తికి కార్యాచరణ

శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో  నీరును పొందే అవకాశం ఉన్నందున ఎన్ని ఇబ్బందులున్నా.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని అందుకు అవసరమైన నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా అందించాలని.. ఇప్పటికే రెండుసార్లు సీఎం  రేవంత్ రెడ్డి  నీటిపారుదలశాఖ ఉన్నత స్థాయి ఇంజనీర్లతో కూడిన స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ( ఎస్ఎల్ఎస్​సి) సమావేశంలో  చర్చించి 2027 డిసెంబర్  9లోగా పూర్తి చేయాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.  

 సొరంగ పనులను పూర్తి చేయించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో  పనులను గత ఫిబ్రవరి మాసంలో చేపట్టింది.  చేపట్టిన వెంటనే సొరంగంలో ప్రమాదం జరిగి టీబీఎం మిషన్ పూర్తిగా మట్టినీరుతో పూడికతో నిండిపోయింది.  

గత ఆరు మాసాలుగా ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులైన విదేశాల ఇంజినీర్లు,  మైనింగ్,  మిలిటరీ స్పెషలిస్టులతో చర్చించి డీబీఎం( డ్రిల్లింగ్ బ్లాస్టింగ్) పక్కమార్గం ద్వారా 9.11 కి. మీ. మిగిలిన సొరంగాన్ని పూర్తి చేయాలని  అందుకు  రూ.2,486 కోట్లకు కేబినెట్ ఆమోదించింది.  

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు  వర్తింపజేయడం.. స్టీలు, సిమెంటు, డీజిల్, లేబర్, ఇతర మెటీరియల్​కు  అప్పటి ధరలను సవరించి క్యూబిక్ మీటరుకు  రూ. 5,328.16కు  గత  ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది.  దీంతోపాటు పెరిగిన ధరలకు అదనంగా లేబర్, మెటీరియల్​కు  చెల్లించేందుకు ఇచ్చిన జీవో. 1046  ప్రకారం  రూ.740.80 కోట్లకు చెల్లింపు, ఇలా అన్నీ కలిపి రూ.4,658.8 కోట్లతో  2023లో  సవరించిన పరిపాలక అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి  కేబినెట్ నిర్ణయించింది.

ఎస్ఎల్బీసీ పూర్తికి ప్రభుత్వం నిర్ణయం

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు దశాబ్దాలుగా నత్తనడకలో ఉన్న ఎస్ఎల్బీసీ పూర్తికి  గత సంవత్సరమే రూ.800 కోట్లను కేటాయించి,  నిర్మాణ సంస్థతో మిగిలిన పనిని పూర్తి చేయడానికి గత ప్రభుత్వం పెంచి ఇచ్చిన రేట్లతో పనులు ప్రారంభించేందుకు  నిర్ణయించింది. 

 డ్రిల్లింగ్ పనులు చేపట్టిన మూడు రోజులకే  గత  ఫిబ్రవరిలో  సొరంగంలో ప్రమాదం జరిగి పై కప్పుకూలి 8 మంది దుర్మరణం చెందారు. ఇంకా ఆరుగురి బాడీలు దొరకకపోవటం. అక్కడ నుంచి డ్రిల్లు చేయని పరిస్థితి ఉంది. 

 ప్రస్తుత  పరిస్థితిలో పక్క మార్గంలో బ్లాస్టింగ్ ద్వారా  చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  డీబీఎం పద్ధతిలో  చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ పద్ధతిలో  చేయాలంటే పర్యావరణ అనుమతులు,  బ్లాస్టింగ్ చేసిన తర్వాత మెటీరియల్​ను  బయటకు  తేవడంలాంటి  అంశాలు  పరిగణనలోకి తీసుకుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వకాలంలో నిర్లక్ష్యం

నీళ్ల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న స్వరాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం..ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా వరద జలాలపై మహబూబ్​ నగర్,  నల్గొండ జిల్లాలలో  చేపట్టిన ప్రాజెక్టులకు కనీసం పదివేల కోట్లు ఖర్చు చేస్తే  పూర్తయ్యేవి.  ఎస్ఎల్బీసీకి  కనీసం రెండువేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేది.  

ఎత్తిపోతల పని లేకుండా గ్రావిటీ ద్వారానే నల్గొండ జిల్లాలో అదనంగా 3.5 లక్షల ఎకరాలకు నీరు అందేది.  కానీ,  ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.  ఇదే కాలంలో  ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై చేపట్టిన  ప్రాజెక్టులను  పూర్తి చేసుకుంటూ  శ్రీశైలం నుంచి  వందల టీఎంసీల జలాలను తరలించుకుపోతుంటే కండ్లప్పగించి  చూసే పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా మన పాలకుల వైఫల్యమే అని చెప్పక తప్పదు.

సొరంగ పనులకు టెండర్లు

2004 ఎన్నికల్లో  కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది.  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వం గతంలో 1990లో  నిర్ణయించిన సొరంగ పనులకు రూ. 2,813 కోట్లకు  పరిపాలన అనుమతి ఇస్తూ  జీ. వో. 147ను 11-–8-–2005లో  ఇవ్వడం జరిగింది.  

ఇందులో  రెండు సొరంగ మార్గాలు తవ్వే పనిని  రూ.1,925 కోట్లకు  జయప్రకాశ్ అసోసియేట్స్ దక్కించుకుంది.  జలయజ్ఞంలో భాగంగా చేర్చి ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలని ఒప్పందం.  మొదటి సొరంగ మార్గం 43.5 కి. మీ.  టీబీఎం పద్ధతిలో,  రెండో  సొరంగ మార్గం 7.25 కి. మీ. బీబీఎం పద్ధతిలో 30 నెలల్లో  పూర్తి చేసేలా ఒప్పందం జరిగింది. 

రెండో సొరంగం పని పూర్తయినా, మొదటి సొరంగం శ్రీశైలం అభయారణ్యంలో టీబీఎంతో చేసే పనికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి.  శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని  ఒక టీబీఎం,  బయటకు నీళ్లు వచ్చేవైపు నుంచి మరొక టీబీఎం సొరంగాన్ని తొలిచే పనిని మొదలుపెట్టారు.  మధ్యలో  టీబీఎం బోరింగులు  దెబ్బతినడం,  శ్రీశైలానికి వరద వచ్చినప్పుడు సొరంగంలోకి నీళ్లు రావడం ఇలా అనేక కారణాలతో జాప్యం జరుగుతోంది. 

ఈ ఒప్పందం జరిగినప్పుడు డీబీఎం పద్ధతిలో  సొరంగం-2ను  చేయడానికి క్యూబిక్ మీటర్ కు  రూ. 964 గా,  టీబీఎం పద్ధతిలో  సొరంగం-2ను  చేయడానికి  రూ. 4,610గా నిర్ణయించారు. కానీ, 2014లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువరకు మొదటి సొరంగంలో 24 కి.మీ.,  రెండో సొరంగం 7.2 కి. మీ  మాత్రమే పూర్తి చేశారు.

- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ ​నేత-