రష్యాలోని కమ్చట్కా(Kamchatka) అనే ప్రాంతంలో ఎప్పుడు లేనంతగా భారీ మంచు కురుస్తోంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 7 అడుగుల కంటే పైగా మంచు కురిసింది. డిసెంబర్ నెల నుండి చూస్తే ఇప్పటివరకు 15 అడుగుల మంచు పేరుకుపోయింది. గత 146 ఏళ్లలో రష్యాలో ముఖ్యంగా మాస్కో ప్రాంతంలో ఇంతటి మంచు తుఫాను ఎప్పుడూ రాలేదని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
ఇళ్ల పైకప్పుల మీద పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా మీద పడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. రోడ్లు, కార్లు, ఇళ్లు అన్నీ మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. దీంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు, బస్సులు ఇతర రవాణా సౌకర్యాలను నిలిపివేశారు.
గంటకు దాదాపు 100 కిలోమీటర్ల (60mph) వేగంతో వీస్తున్న గాలుల వల్ల మంచు కొండల పేరుకుపోయి దారులు మూసుకుపోయాయి. మంచు ఎంత లోతుగా ఉందంటే, జనాలు ఇంటి కిటికీల నుండి బయట ఉన్న మంచు గడ్డల మీదకు దూకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
►ALSO READ | అమెరికాలో మంచు తుఫాన్ : మిచిగాన్ లో 100 వాహనాలు యాక్సిడెంట్..
అయితే ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న మంచు ఫోటోలన్నీ నిజం కావు. అందులో కొన్ని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించినవి ఉన్నాయి. మంచు భారీగానే ఉన్న కొన్ని ఫోటోల్లో చూపిస్తున్నంత అతిగా మాత్రం లేదు. ప్రపంచంలో ఒకవైపు రష్యా ఇలా గడ్డకట్టే చలితో వణుకుతుంటే, మరోవైపు అమెరికాలోని మోంటానా వంటి ప్రాంతాల్లో వాతావరణం పొడిగా, వెచ్చగా ఉండటం గమనార్హం.
