
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగర పరిసర మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇవాళ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన.. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలున్నాయని, గతంలో 8 లక్షల 50 వేల ఉండేవని (2011)అరవింద్ కుమార్ అన్నారు.స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్లన వాటి సంఖ్య 5 లక్షల 50 వేలకు తగ్గిందని ఆయన తెలిపారు. వాటికి వెంటనే ఎబిసి (ఎనిమల్ భర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు.
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అరవింద్ కుమార్ అన్నారు. పాఠశాల విద్యార్థులకు పెంపుడు కుక్కల గురించి అవగాహన లేకపోవడంతో వాటి భారిన పడుతున్నారని.. దీనిని నియంత్రించడానికి విద్యార్థులకు కూడా సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీలల్లో మోప్మా స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పెంపుడు జంతువుల నమోదు గురించి కూడా ఒక ప్రత్యేక మోబైల్ యాప్ ను సిద్ధం చేయాలని అరవింద్ కుమార్ అధికారులకు సూచించారు. వీటిసంబంధించిన ఫిర్యాదులను (MY GHMC) మై జిహెచ్ఎంసీ యాప్ నెంబర్ 040 - 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మోబైల్ యాప్ ను కూడా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ యాప్‌లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని తద్వారా ఒక గుర్తింపు కార్డును కూడా మంజూరు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.