
- సిబ్బంది కొరతతో విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం
హైదరాబాద్,వెలుగు: వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీలు కొరత ఏర్పడింది. ఇప్పటిదాకా కేవలం ఉద్యోగుల కొరతనే ఉండగా, తాజాగా కమిషన్ సభ్యుల దాకా ఆ సమస్య చేరింది. టీజీపీఎస్సీలో చైర్మన్ తో పాటు మరో పది సభ్యులు ఉండాలి. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, గతంలో పనిచేసిన చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2024 జనవరిలో కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితారాజేంద్రన్, రామ్ మోహన్ రావు, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, పాల్వాయి రజనికుమారిని నియమించారు. అయితే, గతేడాది డిసెంబర్ లో మహేందర్ రెడ్డి రిటైర్డ్ కాగా, ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్ర వెంకటేశం నియమితులయ్యారు.
ఈ క్రమంలోనే అనితారాంచంద్రన్ ఫిబ్రవరి నెలలో, రామ్ మోహన్ రావు ఏప్రిల్ నెలలో ఏజ్ లిమిట్ నేపథ్యంలో రిటైర్డ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం చైర్మన్ సహా కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. ఏకంగా పదిమంది సభ్యులుండాల్సిన కమిషన్లో కేవలం ముగ్గురే ఉన్నారు. కనీసం సభ్యులనైనా మార్చాలని కొందరు ఇటీవల సీఎస్ దృష్టికి తీసుకుపోయారు. కాగా, ప్రస్తుతం గ్రూప్ 1 సహా పలు రిక్రూట్మెంట్లపై అభ్యర్థులు కోర్టు బాటపడుతున్నారు.
ఈ క్రమంలో వివిధ అంశాలపై అవగాహన ఉన్న వారుంటే, కమిషన్ సమావేశాల్లో చర్చించి, వాటి పరిష్కారం ఈజీగా అవుతుందనే భావన కమిషన్ ఉద్యోగుల్లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా కొత్తగా కమిషన్ సభ్యులను నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో కమిషన్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా.. చర్చించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కమిషన్ సమావేశాల్లో పది మంది సభ్యులకు ముగ్గురే ఉండటంతో, ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కోరం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఉన్న సభ్యుల్లో మెజార్టీ అటెండ్ అయితే, కోరం ఉన్నట్టేనని కమిషన్ అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో త్వరలోనే కమిషన్ ఆధ్వర్యంలో పలు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ క్రమంలో సభ్యులు లేకపోతే, ఉన్న వారిపై పనిభారం పెరిగే చాన్స్ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా టీజీపీఎస్సీలో కమిషన్ సభ్యులను నియమించాలని నిరుద్యోగులు, కమిషన్ సిబ్బంది కోరుతున్నారు.