హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ.. చీఫ్ మినిస్టర్స్ కప్ (సీఎం కప్) నిర్వహించనుంది. ఇందులో భాగంగా జరుగుతున్న సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీ 31 జిల్లాలు పూర్తి చేసుకుని ఆదివారం రంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కమాన్ వద్ద వేలాదిమంది క్రీడాకారుల కేరింతల మధ్య క్రీడాజ్యోతి ప్రారంభమై సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంది.
ఈ సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిథులు పాల్గొన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో క్రీడాజ్యోతి ర్యాలీ జరుగుతుందని అధికారులు తెలిపారు. టార్చ్ రిలే కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామ, మండల, జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తారు.