రాష్ట్రాలు కూడా చొరబాట్లను అడ్డుకోవాలె : అమిత్ షా

రాష్ట్రాలు కూడా చొరబాట్లను అడ్డుకోవాలె : అమిత్ షా
  • బెంగాల్లో తూర్పు జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా

కోల్కతా: సరిహద్దు నేరాలను అరికట్టడంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)తో సమానమైన బాధ్యత అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్న రాష్ట్రాలకు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. రాష్ట్ర సచివాలయం నబన్నలో తూర్పు జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. అయితే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన బదులుగా ఒడిశా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను సమావేశానికి పంపారు. తూర్పు జోనల్ కు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

బీఎస్ఎఫ్ నిర్లక్ష్యం వల్లే అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ తదితర సీమాంతర నేరాలు జరుగుతున్నాయన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను అంగీకరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిరాకరించినట్లు తెలుస్తోంది. రైల్వే భూముల ఆక్రమణకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు సభ్యుడు  బ్రిజేష్ కుమార్ రైల్వే స్థలాల ఆక్రమణల సమస్యను లేవనెత్తారు. రైల్వే భూమిని ఆక్రమణల నుండి విముక్తి చేయడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. రైల్వే భూముల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పగా, సరైన పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పిస్తే తప్ప ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదని మమతా బెనర్జీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.