హిజాబ్పై అభ్యంతరం.. కాలేజీలో అడుగుపెట్టొద్దన్న యాజమాన్యం

హిజాబ్పై అభ్యంతరం.. కాలేజీలో అడుగుపెట్టొద్దన్న యాజమాన్యం

కర్నాటక: ఉడుపి జిల్లాలో హిజాబ్ విషయంలో ఓ కాలేజీ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. కళాశాలలో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై యాజమాన్యం ఆంక్షలు విధించింది. హిజాబ్ ధరించి వచ్చిన వారిని కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టనిచ్చేదిలేదని స్పష్టం చేసిన యాజమాన్యం.. గురువారం అలా వచ్చిన విద్యార్థినులను గేటు బయటే ఆపేసింది. దీంతో కొందరు విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగారు. ఫైనల్ ఎగ్జామ్స్కు రెండు నెలల ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. ఉడుపి జిల్లా కుందాపూర్ లోని కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

నిజానికి కర్నాటకలో కాలేజీ క్యాంపస్ లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఉంది. కానీ క్లాస్ రూంలో మాత్రం దాన్ని అనుమతించరు. అయితే కుందాపూర్ కాలేజీ యాజమాన్యం మాత్రం కళాశాల ప్రాంగణంలో కూడా హిజాబ్తో కనపడొద్దని అంటోంది. కాలేజీ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణం లేకపోలేదు. బుధవారం కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి రాగా అది చూసిన కాలేజీకి చెందిన 100 మంది అబ్బాయిలు కాషాయ కండువాలతో క్లాసులకు హాజరయ్యారు. విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు స్థానిక ఎమ్మెల్యే హలాది శ్రీనివాస్ శెట్టిని సంప్రదించారు. ఆయన సూచన మేరకు విద్యార్థులంతా యూనిఫాం రూల్స్ పాటించాల్సిందేనని నిర్ణయించారు. ఇదే విషయాన్ని స్టూడెంట్స్ కు చెప్పింది. కానీ గురువారం సైతం కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో గేటు లోపలికి అనుమతించలేదు. ఈ వ్యవహారాన్ని ఉడిపి జిల్లా ఇంఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే ఇరు పక్షాలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అప్పటి వరకు యధాతథ స్థితి కొనసాగించాలని చెప్పామని అన్నారు. 

ఉడుపి జిల్లాలో ఇలాంటి ఘటన ఇదే మొదటిది కాదు. పీయూ గర్ల్స్ కాలేజీ విద్యార్థినులు సైతం క్లాస్ రూంలో హిజాబ్ ధరించేందుకు అనుమతివ్వాలంటూ గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నారు. హిజాబ్తో క్లాసులకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఓ విద్యార్థిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

మరిన్ని వార్తల కోసం..

దళితబంధుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం..మంత్రి ఎర్రబెల్లి

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు