ఆగని సాగు గోస.. రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్య

ఆగని సాగు గోస.. రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్య
  • ఎనిమిదేండ్లలో 8 వేలకుపైగా బలవన్మరణాలు
  • సర్కారు ఆంక్షలు, పంట నష్టం, అప్పుల భారం..
  • అన్నదాతల ఉసురు తీస్తున్నవి ఇవే 
  • రైతు బీమా ఇస్తున్నమని పట్టించుకోని ప్రభుత్వం 

హైదరాబాద్​, వెలుగు: నలుగురికి అన్నం పెట్టే అన్నదాతల ఇండ్లు గొడ గొడ ఏడుస్తున్నాయి. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులు చూస్తున్నాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్​ 18 వరకు రాష్ట్రంలో మొత్తం 7,336 మంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయశాఖ రికార్డుల్లో నమోదైంది. ఇందులో 322 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇంతకీ వరుసగా రైతులు ఎందుకు చనిపోతున్నారు..? ఉచిత కరెంటు, రైతు బంధు స్కీమ్​లతో రైతును రాజును చేసినట్లు చెప్పుకుంటున్న రాష్ట్రంలో అన్నదాతలకు వచ్చిన ఆపతేంది.. తిప్పలేమిటి? ఈ ఆత్మహత్యలకు దారి తీస్తున్న కారణాలు తెలుసుకునేందుకు రాష్ట్ర సర్కారు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదు. 
పరిహారం ఇస్తే.. ప్రాణం లెక్కలేనట్టా..?
‘‘రైతు బీమా ఇస్తున్నం గదా... పట్టాదారు పాసు బుక్కున్న ఏ రైతు చనిపోయినా.. ఐదు రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు పరిహారంగా ఇస్తున్నం గదా. అంతకు మించి ఏం చేస్తం..’’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల సూసైడ్​లను లైట్​ తీసుకుంటున్నారు. 

ఆత్మహత్యలే కాదు, అన్నదాతల చావులు ఏవైనా సర్కారు లైట్​గా తీసుకుంటున్నది. నిరుడు వడ్లు కొంటలేరని కామారెడ్డిలో ఓ రైతు, సూర్యాపేటలో మరో రైతు మార్కెట్​ యార్డుల్లో వడ్ల కుప్పలపైనే కుప్పకూలి చనిపోయారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శ కూడా దక్కలేదు. చూసీ చూడనట్లే వదిలేసింది. రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న కారణాలు తెలుసుకునేందుకు, బాధిత కుటుంబాల గోడును ఆలకించేందుకు గడిచిన ఏడేండ్లలో కనీసం అగ్రికల్చర్​, రెవెన్యూ విభాగాలతో సర్వే కూడా చేయించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్య జరిగితే.. పోలీస్​, రెవెన్యూ, అగ్రికల్చర్​ డిపార్టుమెంట్లతో త్రీమెన్​ కమిటీ అక్కడికి వెళ్లి విచారణ జరిపి, పరిహారంతో పాటు ఆ కుటుంబానికి భరోసా కల్పించే స్కీమ్​ అమలైంది. ఇప్పుడు అంతకు డబుల్​ ఎల్​ఐసీ పరిహారం వస్తుంది కదా.. అని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై ఏనాడూ సమీక్ష కూడా చేయడం లేదు. 
ఆగని విషాదం
నేషనల్​ క్రైమ్​ బ్యూరో ఆఫ్​ రికార్డ్స్​ లెక్కల ప్రకారమే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడాది అక్టోబర్ వరకు 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఆరేడు  నెలల్లో వెయ్యి మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది  రైతు సంఘాలు అంచనా వేశాయి. ఈ లెక్కన ఎనిమిదేండ్లలో 8వేల మందికిపైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలోపు అన్నదాతలకు  రైతు బీమా స్కీమ్​ అమలు చేస్తున్నది. రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి, రైతు చనిపోతే బాధిత కుటుంబాలకు వారం లోపు రూ. 5 లక్షల పరిహారం చెల్లించడం ఈ స్కీమ్​ ఉద్దేశం. నిరుడు ఆగస్టు 15  నుంచి ఈ ఏడాది ఏప్రిల్​ 18 వరకు 15,956 మంది రైతులు చనిపోయినట్లు ఎల్​ఐసీ క్లెయిమ్​లు ఉన్నాయి. వీటిలో యాక్సిడెంట్లు, కరెంటు షాక్​, సాధారణ మరణాలు పక్కన పెడితే పాము కాటు, ఆత్మహత్య చేసుకున్న వారిని అదర్స్​ కేటగిరీలో  నమోదు చేస్తున్నారు. మొత్తం మరణాల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం ఆత్మహత్యలుగా  నమోదవుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. సగటున రోజుకు ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారిని నమ్ముకున్న కుటుంబాలు ఆగమవుతున్నాయి. 
మిర్చి, పత్తి రైతును ముంచిన తెగుళ్లు, 
అకాల వర్షాలు
తెగుళ్ల కారణంగా మిర్చి, పత్తి రైతులు కుదేలయ్యారు. ఈసారి మిర్చికి, పత్తికి రికార్డు స్థాయిలో ధరలున్నా.. పంట చేతికి రాలేదు. ముడుత రోగం నల్లనల్లి, తామర తెగులు సోకి 8 జిల్లాల్లో మిర్చి పంట దెబ్బతింది. ఒక్కో ఊర్లో 20 మంది రైతులు తోటలు వేస్తే ఒక్క తోట కూడా దిగుబడి రాలేదు. దీంతో మిర్చి రైతులకు అప్పులే మిగిలాయి. పంట చేతికొచ్చిందని సంబురపడే లోపే తామర తెగులు సోకి ఒక్క మహబూబాబాద్‌‌ జిల్లాలోనే 3 నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి రైతులను అకాల వర్షాలు దెబ్బతీశాయి. జూన్‌‌ , జులైలో పడిన వానలకు పత్తి పంట భారీగా దెబ్బతింది. ఎకరానికి 12 క్వింటాళ్లదాకా పత్తి రావాల్సి ఉండగా 4 నాలుగు క్వింటాళ్ల వరకే వచ్చింది.  పెట్టుబడి కూడా రాక ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు.
పొలంలోనే ప్రాణం తీసుకున్నడు
వరుసగా రెండేండ్లు పంట దెబ్బతిని అప్పులు ఎలా తీర్చాలో తెలియక మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాలకు చెందిన అబ్బూరి  రాములు (45) పురుగుల మందు తాగి తన పొలంలోనే ప్రాణం తీసుకున్నాడు. రాములు 3 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట సాగు కోసం రెండు బోర్లు వేస్తే ఫెయిల్‌‌ ఇయ్యాయి. నిరుడు కూడా ఇలాగే పంట దెబ్బతింది. పంటసాగు, బోర్ల కోసం తెచ్చిన అప్పులు వడ్డీతో కలిసి రూ.7 లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే దారి కనిపించక మనోవేదనకు గురై ఈ నెల 14న  బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పంట కలిసిరాక.. బిడ్డల పెండ్లిళ్ల అప్పుమీద పడి..
పంట కలిసిరాక, బిడ్డల పెండ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారానికి చెందిన బోడ బీదర్(55) తన రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి, మక్క సాగు చేశాడు. వ్యవసాయంతో పాటు తన నలుగురు బిడ్డల పెండ్లిళ్లకు రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. పంట దిగుబడి అంతంతమాత్రంగానే రావడం, అప్పులు ఇచ్చినోళ్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో మార్చి 11న పురుగుల మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఈ నెల 5న చనిపోయాడు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి
రైతులు వడ్డీ భారం పెరిగి ఆత్మహత్య చేసుకుంటున్నారు.  పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు. మార్కెటింగ్‌‌ సౌకర్యాలు, వాల్యూ అడిషన్ ​రైతులకు అందాలి. అకాల నష్టాలకు పరిహారం ఇయ్యాలి. ఫసల్​ బీమా కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇంకో బీమా తీసుకురావాలి. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి. ఫీల్డ్​ లెవెల్‌‌లో రైతుల సమస్యలు పరిష్కరించాలి.. అప్పుడే అన్నదాతల మరణాలు కొంత ఆగుతాయి. రైతుల మరణాలు, ఆత్మహత్యలకు ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత.                                                                                                                                 ‑ సారంపల్లి మల్లారెడ్డి, రైతు నాయకులు
రైతులకు ధైర్యం చెప్పే వ్యవస్థేది?
రైతులు పెడుతున్న పెట్టుబడికి, వస్తున్న ఆదాయానికి చాలా తేడా ఉంటోంది. తీసుకున్న అప్పులకు వడ్డీ ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ, వడ్డీ లేని లోన్లు ఇవ్వట్లేదు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, సబ్సిడీలు ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను రైతు  సహకార సంఘాలు, పార్టీల నాయకులు ఆదుకోవడం లేదు. - కన్నెగంటి రవి, రాష్ట్ర కన్వీనర్‌‌, రైతు స్వరాజ్యవేదిక
రుణమాఫీ ఏది.. నష్ట పరిహారం ఏది?
సర్కారు భరోసా ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.  వైఎస్సార్​ హయాంలో రైతుల సూసైడ్స్​ తగ్గాయి. తెలంగాణ వచ్చినంక మళ్లీ పెరుగుతూ వచ్చాయి. రెండేండ్లు తగ్గినట్లు అనిపించినా.. ఈ ఏడాది కాలంలో మళ్లీ ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నరు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. నష్టపరిహారం ఇస్తలేరు.  పత్తి, వరిలో దిగుబడులు తగ్గాయి.  పంటలకు గిట్టుబాటు రాకపోవడం ప్రధాన సమస్య. ఇటీవల వరిపై రాజకీయాలు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీశాయి. దీంతోనే సూసైడ్స్​ పెరుగుతున్నాయి. ధరణి కారణంగా తలెత్తిన సమస్యలతోనూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.                                                                                 - దొంతి నర్సింహారెడ్డి, అగ్రికల్చర్​ ఎక్స్‌‌పర్ట్​
ఎట్లా బతుకాల్నో అర్థమైతలేదు
పంట ఎండిపోయి పెట్టుబడి చేతికిరాలే. అప్పుల బాధతో నా భర్త నాలుగు రోజుల కింద పురుగుల మందు తాగి చనిపోయిండు. మా బతుకు దెరువు ఆగమైంది. ఆఫీసర్లు గానీ, లీడర్లు గానీ మమ్మల్ని ఎట్లున్నరు అని అడిగినోళ్లు లేరు. ఎట్లా బతుకాల్నో అర్థమైతలేదు. సర్కారే మమ్ములను ఆదుకోవాలి.
                                                                                         - లక్ష్మి (ఆత్మహత్య చేసుకున్న రైతు అబ్బూరి రాములు భార్య), కొట్టాల, మెదక్ జిల్లా
కోటి ఎకరాల మాగాణం.. అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో అన్నదాతల బలవన్మరణాలు ఆగుతలేవు. ఎనిమిదేండ్లుగా ఈ శోకం కొనసాగుతూనే ఉంది. రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటు న్నారు. ఇట్లా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మూడున్నర నెలల్లో 322 మంది అన్నదాతలు ప్రాణాలు విడిచారు. ప్రభుత్వం విధించిన షరతులు కొంప ముంచాయని కొందరు.. వేసిన పంటలు అమ్ముకోలేక ఇంకొందరు.. అప్పుల భారంతో మరికొందరు..  ఇట్లా ఒక్కో రైతు ఒక్కో తీరు మనాదితో ఊపిరి వదులుతున్నారు.