బెంగాల్ బీజేపీ చీఫ్ గా సుకంత మజుందర్

 బెంగాల్ బీజేపీ చీఫ్ గా సుకంత మజుందర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడు సుకంత మజుందర్ ను నియమించారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరిన ప్రముఖులంతా తిరిగి సొంతగూటికి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ స్పందించింది. ఊహించినట్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చేసింది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న దిలీప్ ఘో‌ష్‌ను బాధ్యతల నుంచి తప్పించి ఎంపీ సుకంత మజుందర్‌ను ఎంపిక చేసింది. 
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. మరికొందరు పార్టీ వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో పార్టీని గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీకి ఒకనాటి కుడిభుజం.. బీజేపీలో చేరి నందిగ్రామ్ లో మమతను ఓడించిన సువేందు అధికారిని నియమించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆయన ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉండడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని నిర్ణయించి ఎంపీ సుకంత మజుందర్‌ ను నియమించినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ముచ్చెమటలు పట్టించి భారీ స్థాయిలో సీట్లు, ఓట్లు పెంచుకున్న బీజేపీ త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికలో బరిలోకి దిగబోతున్న సీఎం మమతా బెనర్జీని మరోసారి ఓడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న దిలీప్ ఘోష్ తోపాటు, బేబి రాణి మౌర్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ.. అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.