ఆదివారం కూడా ఖాతాలో జీతం

ఆదివారం కూడా ఖాతాలో జీతం

బిల్లుల చెల్లింపు, ఈసీఎస్ కూడా..
 సిప్ల చెల్లింపు ఇంకా ఈజీ
 అందుబాటులోకి ‘నాచ్’ విధానం 

న్యూఢిల్లీ: ఇక నుంచి ఆదివారం అయినా, సెలవు రోజుల్లో అయినా ఉద్యోగుల జీతం వారి ఖాతాల్లో పడుతుంది. బిల్స్ డబ్బు డెబిట్ అవుతుంది. మనకు రావాల్సిన డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇందుకోసం వచ్చే నెల నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) అన్ని రోజుల్లోనూ అమలు చేస్తారు. దీనివల్ల  జీతం, పెన్షన్, వడ్డీ, డివిడెండ్  ఇతర చెల్లింపులు,  పెట్టుబడులు బ్యాంక్ సెలవు దినాలలో కూడా డెబిట్/క్రెడిట్ అవుతాయి.  బల్క్ పేమెంట్ సిస్టమ్ కోసం ఎన్‌పీసీఐ నాచ్‌ను డెవెలప్ చేసింది. ఈ టెక్నాలజీ.. డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ మొదలైన వాటి ట్రాన్స్​ఫర్లను సులభతరం చేస్తుంది, విద్యుత్, గ్యాస్, టెలిఫోన్‌, వాటర్ బిల్లు, ఈఐఎంలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల కిస్తీలు, బీమా ప్రీమియం మొదలైనవాటిని బ్యాంకు ఖాతాల నుంచి మినహాయించుకొని సర్వీసు ప్రొవైడర్‌కు చెల్లిస్తుంది. "కస్టమర్ల సౌకర్యం కోసం ఇక నుంచి నాచ్, ఆర్టీజీఎస్‌ ట్రాన్స్​ఫర్లను  24x7 పాటు అందుబాటులో ఉంచాలని ప్రపోజ్ చేశాం. వచ్చే నెల నుంచి ఈ సదుపాయం అమల్లోకి రావొచ్చు" అని ఆర్​బీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 
కంపెనీలకూ మేలు..
యాక్సిస్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సిజి ఫిలిప్ మాట్లాడుతూ, "నాచ్​ను బ్యాంకుల్లో సిప్ నమోదు చేయడానికి తయారు చేశారు. ప్రస్తుతం ఇది బ్యాంకుల పని రోజులలో మాత్రమే అందుబాటులో ఉంది. 2021 ఆగస్టు 1 నుండి  అన్ని రోజుల్లోనూ  నాచ్ పనిచేస్తుందని ఆర్‌బీఐ ప్రకటించింది. దీనివల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుంది. సిప్ ల రిజిస్ట్రేషన్,  సిప్ లకు సంబంధించిన ఆటో-డెబిట్స్ బ్యాంక్ సెలవు దినాలలో కూడా జరుగుతాయి. సిప్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకున్న ప్రాసెసింగ్ సమయాన్ని  నుంచి తగ్గించడానికి ఇది సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు. ఆర్బీఐ నిర్ణయం వల్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా ఇండస్ట్రీలకు మరింత క్యాపిటల్ సులువుగా దొరుకుతుంది. నాచ్ వల్ల ఎకానమీకి సైతం మేలు జరుగుతుందని   గ్రాంట్ తోర్న్ టన్ ఇండియా, నేషనల్ హెడ్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ రిస్క్) వివేక్ అయ్యర్‌  అన్నారు. నాచ్ ద్వారా ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ సేవలు (ఈసీఎస్) 2016 మే నుంచి మొదలయ్యాయి.  ఇక నుంచి బ్యాంక్ ఖాతా నుండి ఆటో-డెబిట్ ఇన్‌స్ట్రక్షన్‌ ఇవ్వడం కోసం తప్పక నాచ్ ఫంక్షన్‌ను ఉపయోగించాలి.