
'RRR' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్‌ను స్వీకరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంపై తెలుగు ప్రజానీకంతో పాటు..యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోతుంది. సోషల్ మీడియా వేదికగా నాటు నాటు పాట హోరెత్తుతోంది. సామాన్యాల నుంచి సెలబ్రిటీల వరకు నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. RRR మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గవాస్కర్ స్టెప్పులు..
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం RRR కు ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. అంతేకాదు నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం సునీల్ గవాస్కర్ స్టెప్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ టెస్ట్ ఐదో రోజు పొద్దున స్టా ర్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్"నాటు నాటు" పాటకు ఆస్కార్ రావడంపై మాట్లాడారు. ఈ సమయంలో వచ్చిన గవాస్కర్..RRR మూవీకి ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. RRR చిత్ర బృందంతో పాటు కీరవాణి, చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. అనంతరం తెలుగు కామెంటేటర్స్‌తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాడు.
సునీల్ గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, దినేశ్ కార్తీక్ లు RRR చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. RRRతో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పర్స్ కు ఆస్కార్ అవార్డు దక్కడంపై భారత మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.