సంక్రాంతికి ట్రాఫిక్ ఉండకుండా చర్యలు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సంక్రాంతికి ట్రాఫిక్ ఉండకుండా చర్యలు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: సంక్రాంతి పండగ సందర్బంగా వాహనాల రద్దీ దృష్ట్యా ప్రయాణాలు సాఫీగా సాగేందుకు  అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణ, ఏర్పాట్లపై జిల్లా పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, జాతీయ రహదారి అధికారులతో ఎస్పీ నరసింహతో కలిసి ఆయన వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌‌ నుంచి గ్రామాలకు వెళ్లేందుకు అధిక మొత్తంలో వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాతీయ రహదారి 65 పై టేకుమట్ల నుంచి నల్లబండగూడెం వరకు యూ టర్న్ లను తాత్కాలికంగా మూసివేసి ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.  

సూర్యాపేట పట్టణంలో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, అంజనీపురి కాలనీ, ఈనాడు కార్యాలయం, కోదాడ వై జంక్షన్, రామాపురం క్రాస్ రోడ్ ల వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా ప్రత్యామ్నాయ  రోడ్డు నుంచి రెండు వైపులా వాహనాలు సాఫీగా వెళ్లేలా వెడల్పు చేయాలని సూచించారు.  ఖమ్మంకి వెళ్లే దగ్గర యూటర్న్ కాకుండా నేరుగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి ఆఫీసర్లను ఆదేశించారు. పండగ రద్దీ సమయంలో పరిశ్రమలకు చెందిన భారీ వెహికల్స్ ప్రధాన రోడ్డుపైకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేలా పరిశ్రమ యజమానులకు సూచించాలని ఆదేశించారు.  హోటల్స్, డాబాల వద్ద రోడ్లపై వాహనాలు నిలపకుండా యజమానులకు తెలియజేయాలని పోలీసులకు సూచించారు. 

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సూచనలు 

పండగ ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు రాయిని గూడెం వద్ద యూటర్న్ మూసివేయాలన్నారు.  ఖమ్మం నుంచి హైదరాబాద్  వెళ్లే వాహనాలు చివ్వెంల  నుంచి, ఐలాపురం నుంచి గాని సూర్యాపేట పట్టణంలోకి వచ్చి హైదరాబాద్ వెళ్లేలా చూడాలన్నారు.  జనగాం, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు కుడకుడ రోడ్డు నుంచి ఐలాపురం మీదుగా బాలెంల వద్ద జనగాం రోడ్డులోకి ప్రవేశించాలని  సూచించారు.  సూర్యాపేట జిల్లాలో ప్రయాణికుల కోసం రెవెన్యూ, పోలీస్, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులు  24  గంటలు అందుబాటులో ఉండేలా  కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేస్తామన్నారు.  

ఎస్పీ కే నరసింహ మాట్లాడుతూ..  సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ అధికంగా ఉంటుందని గుంటూరు వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్లాలని, రాజమండ్రికి వెళ్లే వెహికల్స్ నకిరేకల్, అర్వపల్లి  మీదుగా ఖమ్మం రహదారిలోకి,  రాయనిగూడెం వద్ద ఖమ్మం బైపాస్ లోకి వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, జాతీయ రహదారి అధికారి శ్రవణ్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.