తాజ్ మహల్ సందర్శనకు అనుమతి

తాజ్ మహల్ సందర్శనకు అనుమతి
  • ఈనెల 16 నుంచి సందర్శనకు అవకాశం
  • మ్యూజియంలు,స్మారక మందిరాలు సందర్శించవచ్చు
  • చూడాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా నిబంధనల కారణంగా తాజ్ మహల్ అందాలను దగ్గర నుండి వీక్షించలేకపోతున్నామని బాధపడిపోతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్కియలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ఆధీనంలో ఉన్న స్మారక కట్టడాలు, మ్యూజియంల సందర్శనకు ప్రజలకు అనుమతించాలని నిర్ణయించారు. శానిటైజేషన్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఈనెల 16 నుంచి సందర్శించేందుకు అవకాశం కల్పించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తాజ్ మహల్ తోపాటు దేశవ్యాప్తంగా స్మారక మందిరాల్లో ప్రజల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజ్ మహల్ తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న 3693 స్మారక మందిరాలు, 50 మ్యూజియంలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ సందర్శనకు వేసవిలో చాలా భారీ సంఖ్యలో వచ్చేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా సందర్శకుల జాడ లేక తాజ్ మహల్ సందర్శకులపైనే ఆధారపడి జీవిస్తున్న అనేక మంది చిన్నా, పెద్ద వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వారందరికి ఉపాధి కల్పించడంతోపాటు అభిమానులకు తాజ్ మహల్ సందర్శకులకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పరిమిత సంఖ్యలోనే అనుమతివ్వనున్నారు. ముందుగా టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి.