
- క్రిప్టోతో అప్పులు కూడా!
- వడ్డీ తక్కువ.. ఎప్పుడైనా చెల్లించొచ్చు
- ఫీజులు, ఛార్జీలు ఏం ఉండవు..సిబిల్ స్కోర్‌తో పనిలేదు
- క్రిప్టోలను తనఖా పెట్టాల్సిందే..వాల్యూలో 60% వరకు లోన్
బిజినెస్‌డెస్క్, వెలుగు: ఎటువంటి సిబిల్ స్కోర్ లేకపోయినా, ఏడాదికి కేవలం 4.5 శాతం వడ్డీ రేటుకే లోన్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే ఎలా ఉంటుంది? ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా, ఎటువంటి ఫీజులు, ఛార్జీలు చెల్లించకుండానే లోన్ వస్తే బాగుంటుంది కదా? ఇల్లు, కారు లేదా క్యాష్ డిపాజిట్లను తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా లోన్ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతే అంతకంటే ఇంకేం కావాలి?..ఇవన్ని నెరవేరుతాయి మీ దగ్గర క్రిప్టో కరెన్సీలు ఉంటే. బిట్‌కాయిన్, ఎథరమ్ వంటి క్రిప్టోకరెన్సీలను తనఖాగా పెట్టుకొని లోన్లను ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి కొన్ని కంపెనీలు. యూజర్ల క్రిప్టో వాలెట్‌లో కొన్ని క్రిప్టోలు ఉంటే చాలంటున్నాయి. క్రిప్టో కరెన్సీలు పాపులరవుతున్న విషయం తెలిసిందే. వీటిపై లోన్లను కొన్ని ‘క్రిప్టో బ్యాంకులు’ ఇస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలను తనఖాగా పెడితే లోన్లను క్యాష్ రూపంలో ఇస్తాయి. లేదా కొన్ని స్టేబుల్ కాయిన్ల కింద ఇష్యూ చేస్తాయి. ఈ స్టేబుల్ కాయిన్లను మళ్లీ ఎక్స్చేంజి రేట్ల వద్ద మార్చుకోవచ్చు. స్టేబుల్ కాయిన్లు అంటే మార్కెట్‌లో అందుబాటులో ఉండే ప్రతీ కాయిన్‌కు బ్యాక్ ఎండ్‌లో ఒక డాలర్‌ను డిపాజిట్ చేస్తారు. వీటి రేట్లు ఎప్పుడూ డాలర్‌తో ముడిపడి ఉంటాయి.
సెక్యూర్డ్ లోన్లంటా!
క్రిప్టో ఇండస్ట్రీ ఇలాంటి లోన్లను సెక్యూర్డ్ లోన్లుగా పరిగణిస్తోంది. వాల్డ్, క్రిప్టోడాట్‌కామ్ అండ్ బ్లాక్‌ఫి వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇండియన్ యూజర్లకు క్రిప్టో లోన్లను ఇస్తున్నాయి. యూకేకి చెందిన కాషా ఇక్కడి కో–ఆపరేటివ్ బ్యాంకులతో కలిసి త్వరలో క్రిప్టో లోన్లను ఇస్తామని ప్రకటించింది. క్రిప్టోలపై లోన్లను తీసుకోవడంలో అప్పర్ లిమిట్ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. క్రిప్టో వాల్యూలో 50 శాతం నుంచి 60 శాతం వరకు ఇస్తున్నారు. సాధారణంగా ఇటువంటి లోన్లపై ఫిక్స్‌డ్ లోన్ టెనార్ ఉండదు. ప్రతీ నెల ఈఎంఐలు కట్టడం వంటి విధానం ఉండదు. బారోవర్ ఎంత అమౌంట్ అయినా చెల్లించొచ్చు. ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్లలో అయినా కట్టొచ్చు.
క్రిప్టో లోన్లు తీసుకోవచ్చా?
క్రిప్టో కరెన్సీలు ఎక్కువ వోలటాలిటీతో ట్రేడవుతుంటాయి. ఒకేసారి 20 లేదా 30 శాతం కూడా పడిపోవచ్చు. ఒకవేళ క్రిప్టోల వాల్యూ సడెన్‌గా పడిపోతే వీటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లపై ఈ ప్రభావం ఉంటుంది. దీన్ని కాషా సీఈఓ కుమార్ గౌరవ్ వివరించారు. ‘తనఖా పెట్టిన క్రిప్టోల వాల్యు ఒక లెవెల్‌కు పడిపోతే, మరిన్ని క్రిప్టోలను డిపాజిట్ చేయాలని కస్టమర్లను కోరతాం’ అని అని అన్నారు. లోన్ టూ వాల్యూ(ఎల్‌టీవీ) రేషియోని మెయింటైన్ చేయడానికి ఇలా చేస్తామని చెప్పారు. ఒకవేళ కస్టమర్లు క్రిప్టోలను డిపాజిట్ చేయడంలో ఫెయిలైతే వారి తరపున క్రిప్టోలను సేల్ చేసి ఎల్‌టీవీ రేషియోని మెయింటైన్ చేస్తామని వివరించారు. క్రిప్టో లోన్లలో ఇదొక పెద్ద డిస్‌అడ్వాంటేజ్ అని ఫైనాన్షియల్ ప్లానర్లు అంటున్నారు. గత ఏడాది కాలంలో క్రిప్టో కరెన్సీలు ఎంత వొలటాలిటీలో ట్రేడయ్యాయో చూశాం. సడెన్‌గా వీటి విలువ పడిపోతే తనఖా పెట్టిన క్రిప్టోల్లో కొంత వాటాను యూజర్లు కోల్పోవచ్చని ఎనలిస్టులు పేర్కొన్నారు. క్రిప్టోలపై లోన్ తీసుకునేటప్పుడు పోర్టుఫోలియోలో ఉన్న మొత్తం క్రిప్టోలను తనఖా పెట్టొద్దని సలహా ఇస్తున్నారు.
క్రిప్టో లోన్లు, ఇతర లోన్లకు మధ్య తేడా..
లోన్ టైప్ వడ్డీ రేటు(ఏడాదికి) ఇతర ఛార్జీలు లోన్ టెనార్
క్రిప్టోలపై లోన్ 4-18% ఉండవు 1 రోజు-4 ఏళ్లు
పర్సనల్ లోన్ 25% వరకు 0.5-5% వరకు 1-5 ఏళ్లు
క్రెడిట్ కార్డు 40% వరకు రూ.5,000 వరకు యాన్యువల్ ఫీజు మంత్లీ బిల్లింగ్ సైకిల్