అర్థరాత్రి కారులో మంటలు..గంట పాటు ట్రాఫిక్ జామ్

అర్థరాత్రి కారులో మంటలు..గంట పాటు ట్రాఫిక్ జామ్

తమిళనాడులో రన్నింగ్ కారులో అకస్మాత్తుగా  మంటలు చెలరేగాయి.  చెన్నై పల్లవరం సమీపంలోని జీఎస్టీ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి కారులో మంటలు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అయితే అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. తన యజమానితో కలిసి కారు నడిపిన డ్రైవర్ సెల్వం షాపింగ్ కోసం చెన్నైలోని పల్లవరంలోని శరవణ స్టోర్స్‌కు వచ్చాడు. అయితే"ఓనర్‌ను షాపింగ్ స్టోర్‌ దగ్గర దింపిన తర్వాత, పార్కింగ్ ఏరియా వద్ద కారును పార్క్ చేయడానికి డ్రైవర్ సెల్వం వెళుతుండగా.. కారు ముందు భాగంలో (బానెట్) నుండి పొగలు రావడం గమనించాడు. దీంతో వెంటనే కారును రోడ్డుపైనే ఆపి కిందకు దిగేశాడు. ఆ తర్వాత కారు మొత్తం మంటలు వ్యాపించాయి. 

ఈ ఘటనతో జీఎస్టీ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. కారు ప్రమాదంలో  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు.