
- షెడ్యూల్డ్ హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్నరు: తమ్మినేని
హైదరాబాద్, వెలుగు: కుమ్రంభీం టైగర్ కారిడార్ పేరుతో ఆదివాసీల సాగు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. 49వ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన జాతీయ అటవీ విధానం ద్వారా షెడ్యూల్డ్ హక్కులను కాలరాసి, అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నరని ఫైర్ అయ్యారు. చత్తీస్‌గఢ్‌లోని అడవి ప్రాంతంలో 4 లక్షల ఎకరాలను ఆదానీకి కట్టబెట్టారని చెప్పారు. మన రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామన్న హామీని కాంగ్రెస్ ఏడాది దాటినా అమలు చేయలేదని విమర్శించారు.
పోడు సాగుదారులపై అటవీ అధికారులతో దాడులు చేయించి, అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.