ఎయిర్​ ఇండియా కొనుగోలుపై టాటా అగ్రిమెంట్

V6 Velugu Posted on Oct 26, 2021

  • డిసెంబర్ నాటికి డీల్ పూర్తవచ్చు

న్యూఢిల్లీ: ఎయిర్​ ఇండియాను అమ్మేందుకు టాటా సన్స్​తో కేంద్ర ప్రభుత్వం సోమవారం షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ (ఎస్​పీఏ) కుదుర్చుకుంది. ఎయిర్​ ఇండియాను రూ. 18 వేల కోట్లకు కొనడానికి టాటా సన్స్​ బిడ్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్​ ఇండియాను కొనే రేసులో టాటా గ్రూపే హయ్యస్ట్​ బిడ్​ దాఖలు చేసింది. టాటా సన్స్​తో షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​పై సంతకాలు చేసినట్లు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ ఎసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్) సెక్రటరీ తుహిన్​ కాంత పాండే ట్విటర్​లో వెల్లడించారు. ఎయిర్​ ఇండియాతో పాటు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​నూ టాటా గ్రూప్​ చేజిక్కించుకుంది.

ఎయిర్​ ఇండియా ప్రైవేటు చేతికి వెళ్తే మళ్లీ గ్రోత్​ బాట పడుతుందని సివిల్​ ఏవియేషన్​ సెక్రటరీ రాజీవ్​ బన్సల్​ ఇంతకు ముందే చెప్పారు. ప్రొఫెషనల్​గా నడపడం వల్లే ఆ గ్రోత్​ సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద విమానాలను మంచిగా వాడుకోవడంతోపాటు, విమానాలలో కల్పించే సేవలను మెరుగుపరిస్తే ఎయిర్​ ఇండియాకు తిరుగు ఉండదని బన్సల్​ చెప్పారు. వాడకం సరిగా ఉంటే విమానాల ఫ్లయింగ్​ హవర్స్​ కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే నెలల్లో మరో కొత్త ఎయిర్​లైన్​ రావడంతోపాటు, జెట్ ఎయిర్​వేస్​ కూడా మళ్లీ కార్యకలాపాలు మొదలు పెట్టనుంది. ఎక్కువ మంది పోటీదారులు మార్కెట్లో ఉండటం వల్ల ఏవియేషన్​ సెక్టార్​కు మేలే జరుగుతుందని, కన్జూమర్లకూ బెనిఫిట్​ ఉంటుందని రాజీవ్​ బన్సల్​ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ప్లేయర్లు ఉండటం వల్ల మార్కెట్లో మోనోపోలీకి ఛాన్స్​ ఉండదన్నారు.

టాటా గ్రూప్​లోని టాలేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎయిర్​ ఇండియా కోసం బిడ్​ను వేసింది. ఎయిర్​ ఇండియా చేజిక్కుంచుకోవడానికి రూ. 2,700 కోట్ల క్యాష్​ను చెల్లించడానికి, రూ. 15,300 కోట్ల ఎయిర్​ ఇండియా అప్పులను తీసుకోవడానికీ ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఆ తర్వాత అక్టోబర్​ 11న గవర్నమెంట్​ ఈ కంపెనీకి లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ (ఎల్​ఓఐ) జారీ చేసింది. ఎయిర్​ ఇండియాలో 100 శాతం వాటాను ప్రభుత్వం అమ్మేస్తోంది. స్పైస్​జెట్​ ప్రమోటర్​ అజయ్​ సింగ్​ కూడా ఎయిర్​ ఇండియా కోసం టాటాలతో పోటీ పడ్డారు. కానీ, ఆయన బిడ్​ రూ. 15,100 కోట్లే. దాంతో టాటాలకే ఎయిర్​ ఇండియా  దక్కింది. టాటా గ్రూప్​తో ఎయిర్​ ఇండియా డీల్​ డిసెంబర్​ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్​కు ఇప్పటికే రెండు ఎయిర్​లైన్స్​ కంపెనీలలో పెట్టుబడులున్నాయి. ఎయిర్​ ఇండియాతో కలిపితే ఆ గ్రూప్​ చేతిలో మూడు ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఉంటాయి. ఎయిర్​ ఇండియాకు 43 వైడ్​ బాడీ ప్లేన్​లు ఉండగా, అందులో 27 బోయింగ్​ 787 విమానాలే ఉన్నాయి. ఎయిర్​ ఇండియా చేతిలో మొత్తం 141 విమానాలుండగా, అందులో 42 లీజుకి తీసుకున్నవి. టాటాలు తీసుకోగా మిగిలిన ఎయిర్​ ఇండియా అప్పులు రూ. 46,262 కోట్లను ఎయిర్​ ఇండయా ఎసెట్​ హోల్డింగ్​ లిమిటెడ్​ (ఏఐఏహెచ్ఎల్​) తీసుకుంటుంది. ఎయిర్​ ఇండియా నిర్వహణ బాధ్యతల నుంచి వీలయినంత త్వరగా తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే దాని నిర్వహణ కోసం  రోజుకి రూ. 20 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది.
 

Tagged deal, tata group, air india, Indian airlines, union govt, TATA, tata sons, SAP, centre govt, acquision, sharpurchase agriment

Latest Videos

Subscribe Now

More News