
- చితకబాదిన స్థానికులు
- బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని దొంగగా మారిన టెకీ
కూకట్పల్లి, వెలుగు: బెట్టింగ్ యాప్‌లో లక్షల్లో పోగొట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొంగగా మారాడు. పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. దీంతో అతడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే సుధీర్‌కుమార్(25) సాఫ్ట్వేర్ ఇంజినీర్. బెట్టింగ్యాప్స్లో రూ.20 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలు చేయాలనుకున్నాడు.
కూకట్పల్లి రాంనరేశ్నగర్లో 84 ఏళ్ల వృద్ధురాలు మణెమ్మ ఇంట్లోకి శుక్రవారం ఉదయం గోడ దూకి వెళ్లాడు. బెడ్రూమ్ పక్కన నక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కదలికలు గమనించిన వృద్ధురాలు మణెమ్మ గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వచ్చి సుధీర్‌కుమార్‌ను పట్టుకుని చీపురు కట్టలు, చెప్పులతో కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడి వద్ద కత్తి, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.