
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆయిల్ పామ్ సాగుకు హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సెక్రటేరియెట్ లో ఆయిల్ ఫెడ్, 13 ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏటా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా కంపెనీలు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.72 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతున్నదని, రాబోయే మూడేండ్లలో 10 లక్షల ఎకరాలకు చేరాలని తెలిపారు. ఈ దిశగా కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషాకు సూచించారు.
సాగు విస్తరణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, అటువంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపెనీలు నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం రైతు సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న సీడ్ గార్డెన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సీడ్ గార్డెన్ ద్వారా హైబ్రిడ్ ఆయిల్ పామ్ మొక్కల ఉత్పత్తి రైతులకు ఎంతో మేలు చేస్తుందని, తెలంగాణ దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, హార్టికల్చర్అధికారులు పాల్గొన్నారు.